వైసీపీ మైండ్‌గేమ్‌తో టీడీపీ చిత్తు..!

ఉన్నది లేనట్లుగా…లేనిది ఉన్నట్లుగా..నిజాన్ని అబద్దంగా.. అబద్దాన్ని నిజంగా మార్చడమే రాజకీయం. ఒకప్పుడు ప్రజల్లో తిరిగి వారి మెప్పు పొంది నేతలు ఓట్లు పొందేవారు. కానీ ఇప్పుడు మైండ్ గేమ్‌లు ఆడి ఓట్లు పొందుతున్నారు. ఈ మైండ్ గేమ్ ఆడటంలో వైసీపీ బాగా ఆరితేరిపోయింది. వైసీపీ ఆడే గేమ్‌లో పడి టీడీపీ చిత్తు అవుతూనే ఉంది. అయితే ఇటీవల వైసీపీ మరో మైండ్‌గేమ్‌కు తెరలేపింది. ఈ గేమ్‌లో కూడా టీడీపీ చిత్తు అయ్యేలా ఉంది.

రాజధాని విషయంలో వైసీపీ ముందు నుంచి గేమ్ ఆడుతుంది. మూడు రాజధానులతో మూడేళ్ళ క్రితమే గేమ్ మొదలుపెట్టింది. కానీ మూడు రాజధానుల కోసం ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేసి ఫెయిల్ అయ్యారు. కాకపోతే రాజకీయంగా ఎప్పుడు పోరాటం చేయలేదు. అమరావతి రైతులు మాత్రం మూడేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. మూడేళ్ళ నుంచి ఏ మాత్రం పోరాటం చేయని వైసీపీ..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందనగా, విశాఖని రాజధాని చేయాలనే డిమాండ్‌తో పోరాటం చేయడం, జే‌ఏ‌సి ఏర్పాటు చేయడం, ఉత్తరాంధ్ర ప్రజల్లో సెంటిమెంట్ లేపి టీడీపీని నెగిటివ్ చేసి, రాజకీయంగా లబ్ది పొందే కార్యక్రమానికి తెరలేపారు.

ఈ విషయంలో వైసీపీ సక్సెస్ అవుతుంది..కానీ టీడీపీ వైసీపీ వ్యూహానికి బ్రేకులు వేయలేకపోతుంది. అసలు మూడు రాజధానుల వల్ల నష్టం ఏంటి? అమరావతి వల్ల లాభం ఏంటి? వైసీపీ ఆడుతున్న గేమ్‌ని ప్రజలకు వివరించలేకపోతుంది. దీని వల్ల ఉత్తరాంధ్రలో వైసీపీది పైచేయి అయ్యేలా ఉంది. ఇప్పుడుప్పుడే వైసీపీ ఆడుతున్న గేమ్‌ని ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మే పరిస్తితి వస్తుంది.

రాజధాని తమకు దగ్గరకు వస్తుంటే ఎందుకు కాదు అంటాం అనే కోణంలో అక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు. వైసీపీకి కూడా కావాల్సింది ఇదే. పైగా రాష్ట్రంలో ఇతర సమస్యలు పక్కకు వెళ్ళిపోయి, కేవలం రాజధాని రచ్చని మాత్రం తెరపైకి తీసుకొచ్చి..ఎన్నికల్లో కూడా రాజధాని రిఫరెండంగానే ఎన్నికలకు వెళ్ళి లబ్ది పొందాలనే కోణంలో వైసీపీ ముందుకెళుతుంది. ఇక వైసీపీ మైండ్ గేమ్‌ని అర్ధం చేసుకోలేక టీడీపీ చతికలపడుతూనే ఉంది.