కాపు ‘ఫ్యాన్స్’ ఎత్తులు..పవన్‌తో చిక్కులు..!

ఏపీలో రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికలు టార్గెట్‌గానే ప్రధాన పార్టీలు ముందుకెళుతున్నాయి. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని వైసీపీ, గత ఎన్నికల మాదిరిగా కాకుండా, ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో టీడీపీ ఉంది. ఇదే క్రమంలో  రెండు పార్టీలు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళుతున్నాయి. అలాగే కులాల ఆధారంగా రాజకీయాన్ని రంజుగా నడిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు ఓటర్లని తిప్పుకునేందుకు రెండు పార్టీలు కష్టపడుతున్నాయి.

అయితే టీడీపీతో పవన్ కలుస్తారని క్లారిటీ వచ్చేస్తుంది..దీంతో మెజారిటీ కాపు ఓటర్లు..ఆ రెండు పార్టీల వైపుకు వెళ్తారని క్లారిటీగా తెలుస్తోంది. అందుకే ఆ రెండు పార్టీలని పొత్తు పెట్టుకోకుండా చేసేందుకు వైసీపీ నేతలు కష్టపడుతున్నారు. కానీ పొత్తు దాదాపు ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో..కాపు ఓటర్లని చేజారిపోనివ్వకుండా చూసుకోవాలని కాన్సెప్ట్‌తో వైసీపీ కాపు నేతలు ముందుకెళుతున్నారు. ఇప్పటికే బీసీల ఓట్లు పోకుండా వారి కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పుడు కాపు నేతలు ప్రత్యేక సమావేశం పెట్టుకుంటున్నారు..రాజమండ్రి వేదికగా వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు..సమావేశమవుతున్నారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రంలో కాపులు అంతా వైసీపీకి మళ్ళీ మద్ధతు ఇచ్చేలా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా పవన్ టార్గెట్‌గా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. కాపులని పవన్..చంద్రబాబుకు తాకట్టు పెట్టబోతున్నారని మాట్లాడుతున్నారు.

అయితే చంద్రబాబు-పవన్ కలిస్తే..మొదట చిక్కుల్లో పడేది వైసీపీ కాపు నేతలే. అందుకే ఇప్పుడు వారికి కౌంటరుగా సమావేశం పెట్టుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ద్వారా కాపులకు చాలా మంచి జరిగిందని చెబుతూ..బాబు-పవన్ వల్ల కాపులకు నష్టమనే కుల సమీకరణాన్ని తెరపైకి తీసుకొచ్చి..మళ్ళీ కాపుల మద్ధతు పొంది అధికారంలోకి రావాలనే కాన్సెప్ట్ వైసీపీది. కానీ అది పూర్తిగా వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ఏం ఒరిగిందో…ఆ వర్గానికే బాగా తెలుసు. కాబట్టి మళ్ళీ వైసీపీ కాపు నేతల మాటలని కాపులు నమ్ముతారా? అంటే చెప్పలేం. మరి వైసీపీ కాపు నేతల వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.