రాజంపేటలో మళ్ళీ సైకిల్ రివర్స్..!

వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ప్రాంతాల్లో రాజంపేట పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ రెడ్డి వర్గం ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల..వైసీపీకి మంచి పట్టుంది. అందుకే గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. అందులోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..తనయుడు మిథున్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2014లో పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి దక్కింది. బీజేపీ తరుపున పురందేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టీడీపీ తరుపున డి‌ఏ సత్యప్రభ పోటీ చేసి భారీ మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇలా రెండుసార్లు ఈ సీటు వైసీపీ ఖాతాలో పడింది.

అయితే రాష్ట్రంలో నిదానంగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం..అలాగే రాజంపేటలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం, వైసీపీకి ప్రధానంగా అండగా ఉండే రెడ్డి, ఎస్సీ, ముస్లిం వర్గాలకు పెద్దగా ఒరిగింది ఏమి లేదు. దీంతో ఇక్కడ వైసీపీకి కాస్త యాంటీ వచ్చింది. ఇదే సమయంలో ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా సత్యప్రభ బంధువు, వ్యాపారవేత్త గంటా నరహరి ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఈయన పార్టీలో చేరారు. చేరిన వెంటనే మదనపల్లె మినీ మహానాడు విజయవంతం అయ్యేలా చేశారు.

కానీ ఆ ఊపు నెల రోజులు మాత్రమే ఉంది..మళ్ళీ యాక్టివ్ గా ఉండటం తగ్గించేశారు. దీంతో ఇక్కడ టీడీపీ పరిస్తితి మళ్ళీ రివర్స్ అయింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్ళపల్లె సీట్లు ఉన్నాయి. వీటిల్లో పీలేరు, రాజంపేట స్థానాల్లోనే టీడీపీ పరిస్తితి బాగుంది. మిగిలిన చోట్ల పార్టీ పరిస్తితి బాగోలేదు. అలా అని వైసీపీ పరిస్తితి గొప్పగా లేదు. మదనపల్లె, రైల్వేకోడూరు, తంబళ్ళపల్లె సీట్లలో వైసీపీపై యాంటీ ఉంది. కానీ ఆ యాంటీని ఉపయోగించుకోవడంలో టీడీపీ ఫెయిల్ అవుతుంది. దీంతో రాజంపేట పార్లమెంట్‌లో మళ్ళీ వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తుండగా, టీడీపీ వెనుకబడింది.