కడపలో లెక్కలు మారనున్నాయా?

జగన్ సొంత జిల్లా కడపలో ఈ సారి ఖచ్చితంగా సత్తా చాటాలని చెప్పి టీడీపీ శ్రేణులు కసిగా పనిచేస్తున్నాయి. చంద్రబాబు సైతం కడప జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి..ఎప్పటికప్పుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..కడపలో బలపడాలనే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఈ సారి మాత్రం కనీసం 3-4 సీట్లు గెలవాలని టీడీపీ టార్గెట్‌గా పెట్టుకుంది.

ఈ క్రమంలోనే జిల్లాలో ఆరు సీట్లపై టీడీపీ ఫోకస్ చేసింది. జిల్లాలో మొత్తం పది సీట్లు ఉంటే..10కి 10 సీట్లు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిల్లో కొన్ని సీట్లని టీడీపీ గెలుచుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, కమలాపురం, జమ్మలమడుగు, రైల్వేకోడూరు సీట్లపై టీడీపీ ఫోకస్ పెట్టింది. మిగిలిన నాలుగు సీట్లు అయిన బద్వేలు, పులివెందుల, కడప, రాయచోటి సీట్లలో టీడీపీ గెలవడం జరిగే పని కాదు.

అందుకే ఆ నాలుగు పక్కన పెట్టి..ఈ ఆరు సీట్లపై ఫోకస్ పెట్టింది. ఈ ఆరు నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. కాకపోతే ఆరు చోట్ల టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయా? అంటే ఆరు కాదు గాని మూడు చోట్ల లేవని చెప్పొచ్చు. టీడీపీ శ్రేణులు పైకి కమలాపురం, జమ్మలమడుగు, రైల్వేకోడూరు సీట్లలో కూడా సత్తా చాటుతామని అంటున్నాయి గాని..వాస్తవానికి చూసుకుంటే ఆ మూడు సీట్లలో ఇప్పటికీ వైసీపీ బలం తగ్గలేదు. కాబట్టి ఈ మూడు సీట్లు డౌటే.

కానీ మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట సీట్లలో టీడీపీకి అనుకూల వాతావరణం ఉంది. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. పైగా ఈ మూడు చోట్ల వైసీపీలో గ్రూపు పోరు ఎక్కువ కనిపిస్తోంది..ఇటు టీడీపీ నాయకత్వం బలంగా ఉంది. ఇంకాస్త కష్టపడితే మూడు సీట్లలో టీడీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎంత కాదు అనుకున్న ఈ సారి కడపలో 2 సీట్లు ఖచ్చితంగా గెలిచేలా ఉంది.