నెల్లూరు టీడీపీలో కొత్త ముఖాలు..నాలుగు సీట్లలో..?

గత ఎన్నికల తర్వాత దాదాపు అన్నీ జిల్లాల్లో టీడీపీ గాడిన పడింది గాని..ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం 2019 ఎన్నికల పరిస్తితులే ఉన్నాయి. ఆఖరికి సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా టీడీపీ పరిస్తితి కాస్త మెరుగైంది..రెండు-మూడు సీట్లలో ఆ పార్టీ పరిస్తితి బాగుంది. అటు కర్నూలు జిల్లాలో కూడా పర్లేదు. అలాగే చిత్తూరు జిల్లాలో కాస్త బెటర్. కానీ నెల్లూరులోనే టీడీపీ పుంజుకోలేదు. నాయకులు ఇప్పటికీ సరిగ్గా పనిచేయకపోవడం..పైగా కొందరు నాయకులు టీడీపీలో పనిచేస్తూనే..పరోక్షంగా వైసీపీకి మద్ధతుగా ఉన్నారు.

అంటే కోవర్ట్ రాజకీయం..దీని వల్ల నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలో టీడీపీ చిత్తుగా ఓడింది..అసలు కొన్ని చోట్ల అభ్యర్ధులని కూడా పెట్టలేకపోయింది. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేదంటే..దానికి కారణం టీడీపీ నేతలే. అయితే అలాంటి వారికి చంద్రబాబు చెక్ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు జిల్లా నేతలకు క్లాస్ ఇచ్చారు. అయినా సరే మార్పు రాలేదు. దీంతో బాబు ఈ సారి జిల్లాలో మార్పులు చేయడానికి రెడీ అయ్యారు.

త్వరలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి సమీక్షా సమావేశం చేసి..పార్టీలో మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే ఓ సీనియర్ నేతని నెల్లూరు జిల్లా ఇంచార్జ్‌గా నియమిస్తారని తెలుస్తోంది. ఇదే క్రమంలో జిల్లాలోని నాలుగు సీట్లలో కొత్త అభ్యర్ధులని పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు దినేష్ రెడ్డికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.

అటు ఆత్మకూరు సీటుని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డికి ఇస్తారని తెలిసింది. ఆత్మకూరు ఉపఎన్నిక ముందే కైవల్య రెడ్డి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయలేదు. నెక్స్ట్ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి టీడీపీ తరుపున కైవల్య పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అలాగే నెల్లూరు రూరల్, ఉదయగిరి స్థానాల్లో కూడా కొత్త అభ్యర్ధులు పోటీ చేస్తారని తెలుస్తోంది. అటు నెల్లూరు సిటీలో నారాయణ లేదంటే..ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరోకరు పోటీ చేసే ఛాన్స్ ఉంది.