ఎట్టకేలకు తప్పు ఒప్పేసుకున్న బండ్ల గణేష్… ఆ వాయిస్ తనదేనంట?

బండ్ల గణేష్ అంటే ఎవరో తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. అప్పుడప్పుడు కాస్త కాంట్రవర్సీ మాటలతో మీడియాకు మేతగా మారుతాడు ఈ ప్రముఖ నిర్మాత. కమిడియన్ గా, నిర్మాతగా కాకుండా పవన్ కళ్యాణ్‌ అభిమానిగానే బండ్ల బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో బండ్ల ఇచ్చే ఒక స్పీచ్ తో బాగా పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌ గురించి బండ్ల చెప్పినట్టుగా, పొగిడినట్టుగా ఇంకెవ్వరూ మాటల తూటాలు పేల్చలేరు. ఆయన మాటలు వింటుంటే.. ఓ హై వచ్చేస్తుంది. నరనరాలను ఉత్తేజపరిచేట్టుగా ఉంటుంది. బండ్లన్న స్పీచు నడుస్తున్న సమయంలో స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోవాల్సిందే.

ఈ క్రమంలో బండ్ల ఇచ్చే స్పీచు కోసం పవన్ కళ్యాణ్ ఈవెంట్లకు వచ్చే అభిమానులు కూడా వున్నారు. అయితే భీమ్లా నాయక్ సమయంలో మాత్రం కాస్త తేడా కొట్టేసింది. వకీల్ సాబ్ ఈవెంట్లో బండ్లన్న స్పీచ్ ఎఫెక్ట్ బాగానే పని చేసింది. పవన్ కళ్యాణ్ స్పీచ్ కంటే.. బండ్లన్న ప్రసంగానికే నాడు ఎక్కువ మార్కులు పడ్డాయి. దీంతో భీమ్లా నాయక్ ఈవెంట్‌కు బండ్లన్నను దూరం పెట్టేశారట. భీమ్లా నాయక్ ఈవెంట్ కోసం బండ్లన్న స్పీచ్ రెడీ చేసుకున్నాడట. తన దేవుడిని పొగిడేందుకు కొన్ని లైన్స్ రాసుకున్నాడట. కానీ చివర్లో త్రివిక్రమ్ ట్విస్ట్ ఇచ్చాడట. త్రివిక్రమ్ తనను ఈవెంట్‌కు పిలవొద్దని అన్నాడట.

ఈ మేరకు ఓ ఆడియో ఫైల్ కొన్నాళ్ల క్రితం వైరల్ అయిన సంగతి తెలిసినదే. అప్పుడు అయితే అది తన వాయిస్ కాదని బండ్లన్న బుకాయించాడు. కానీ ఇప్పుడు అది తన వాయిసే అని తాజాగా ఓ మీడియా వేదికగా ఒప్పేసుకున్నాడు. అయితే నాటి ఈవెంట్లో త్రివిక్రమ్ ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే త్రివిక్రమ్ స్పీచ్ ఎలా ఉంటుంది.. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెబుతాడా? అని ఎదురుచూసిన అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. ఇక ఇప్పుడు బండ్ల గణేష్ తన ఆడియో ఫైల్ మీద స్పందించడంతో మరోసారి నాటి సంగతులు వైరల్ అవుతున్నాయి. నాటి వీడియో మీద చర్చలు జరుగుతున్నాయి.