ఎన్టీఆర్ అడ్డాలో కొత్త క్యాండిడేట్..?

ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు గ్రామం..పామర్రు నియోజకవర్గంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పుట్టిన వూరు ప్లేస్ అయిన పామర్రులో ఇంతవరకు టీడీపీ గెలవకపోవడం…ఆ పార్టీ శ్రేణులని బాగా నిరాశపరుస్తుంది. 2008లో పామర్రు నియోజకవర్గం ఏర్పడింది..అప్పటినుంచి అంటే 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ వరుసగా ఓడిపోతూనే వస్తుంది. గత ఎన్నికల్లో దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్ గెలిచారు. కృష్ణా జిల్లాలో ఇదే హయ్యెస్ట్ మెజారిటీ.

అంటే పామర్రులో వైసీపీ బలం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా వైసీపీ బలంగా ఉన్న పామర్రులో గెలవాలని చెప్పి టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో ఓడిన ఉప్పులేటి కల్పనని సైతం చంద్రబాబు పక్కన పెట్టారు. పామర్రు ఇంచార్జ్‌గా వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజాని పెట్టారు. ఇంచార్జ్‌గా వచ్చాక రాజా బాగానే నియోజకవర్గంలో తిరుగుతూ పనిచేస్తున్నారు. కానీ అనుకున్న విధంగా టీడీపీని బలోపేతం చేయడంలో వెనుకబడ్డారు.

పైగా ఇక్కడ డామినేట్ చేసే కమ్మ వర్గం..వర్లకు పూర్తి స్థాయిలో మద్ధతు ఇస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో పామర్రులో టీడీపీ ఇంకా వెనుకబడే ఉంది. ఇటీవల సర్వేల్లో కూడా పామర్రులో మళ్ళీ వైసీపీదే గెలుపు అని తేలింది. దీని బట్టి చూస్తే పామర్రుని టీడీపీ మరోసారి కోల్పోయేలా ఉంది. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్ధిని పెట్టాలనే డిమాండ్ ఎక్కువ వస్తుంది.

అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే డీవై దాసుని వైసీపీ సస్పెండ్ చేసింది. 2009లో ఈయన కాంగ్రెస్ నుంచి పామర్రులో గెలిచారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరం జరిగి..వైసీపీలోకి వచ్చారు. కానీ వైసీపీలో ప్రాధాన్యత లేదు. తాజాగా ఆయన పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి వైసీపీ సస్పెండ్ చేసింది. ఇక ఈయన టీడీపీ లేదా జనసేనలోకి వస్తారని ఎప్పటినుంచి ప్రచారం ఉంది. ఇంకా ఎందులోకి వెళ్తారో క్లారిటీ లేదు గాని..టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో..ఉమ్మడి అభ్యర్ధిగా డీవై దాసుని బరిలో దించే అవకాశాలు కూడా ఉన్నాయని పామర్రులో ప్రచారం నడుస్తోంది. మరి చూడాలి చివరికి ఎవరిని బరిలో ఉంచి…ఎన్టీఆర్ గడ్డని సొంతం చేసుకుంటారో.