మద్దిపాటికి లక్కీ ఛాన్స్..టీడీపీ రాత మారుతుందా?

వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. గతంలో కూడా యువతకు సీట్లు ఇస్తామని చెప్పారు గాని..ఆ విషయాన్ని ఆచరణలో ఎక్కువ పెట్టలేదు. కానీ ఈ సారి మాత్రం ఆచరణ దిశగానే బాబు ముందుకెళుతున్నారు. పలు సీట్లలో యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే దిశగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే పలు సీట్లలో ఇంచార్జ్‌లుగా యువ నేతలని పెట్టిన బాబు..తాజాగా గోపాలాపురం ఇంచార్జ్‌గా మద్దిపాటి వెంకటరాజుని నియమించారు.

గోపాలాపురం అంటే టీడీపీ కంచుకోట…ఇక్కడ మంచి విజయాలే సాధించింది. కానీ గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా 37 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయింది. టీడీపీ నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోగా, వైసీపీ నుంచి తలారి వెంకట్రావు పోటీ చేసి గెలిచారు. అంత భారీ మెజారిటీతో గెలిచిన తలారి..గోపాలాపురంలో అద్భుతమైన కార్యక్రమాలే ఏమి చేయడం లేదు. ప్రభుత్వం నుంచి పథకాలే తప్ప..గోపాలాపురం అభివృద్ధి శూన్యం. ఈ క్రమంలో తలారిపై కాస్త ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది.

అలా అని ఇక్కడ టీడీపీ పూర్తిగా పికప్ అయినట్లు కనిపించడం లేదు. ఇప్పటివరకు ఇంచార్జ్‌గా ఉన్న ముప్పిడి వెంకటేశ్వరరావు..అప్పుడప్పుడు ప్రజా పోరాటాలు చేయడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ముప్పిడిని సైడ్ చేసి పార్టీ కోసం కష్టపడుతున్న మద్దిపాటికి బాబు ఛాన్స్ ఇచ్చారు. ఇంచార్జ్‌గా నియమించారు.

ఇప్పటికే పార్టీ ప్రోగ్రామ్ క‌మిటీ ఛైర్మన్‌గా సక్సెస్ అయ్యారు. ఆ ప‌ద‌వితో పాటు పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి కూడా నిర్వహిస్తున్నారు. ఇలా పార్టీ కోసం కష్టపడుతున్న మద్దిపాటి..గత ఎన్నికల్లోనే గోపాలాపురం సీటు ఆశించారు. కానీ అప్పుడు దక్కలేదు. అయినా నిరాశపడకుండా పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోయాక ఇంకా దూకుడుగా పనిచేస్తూ..పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తున్నారు. ఇలా పనిచేస్తుండటంతో బాబు..మద్దిపాటికి ఇంచార్జ్ పదవి కూడా ఇచ్చారు. మరి మద్దిపాటి పగ్గాలు తీసుకోవడంతో..ఇకనుంచైనా గోపాలాపురంలో టీడీపీ రాత మారి..వచ్చే ఎన్నికల్లో గోపాలాపురంని కైవసం చేసుకుంటుందేమో చూడాలి.