ఒంగోలులో బడా క్యాండిడేట్..టీడీపీకి ప్లస్..?

టీడీపీకి ఏ మాత్రం బలం లేని ప్రాంతాల్లో ఒంగోలు పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ టీడీపీకి ముందు నుంచి పెద్ద బలం లేదు..గతంలో 1984లో ఒకసారి, 1999లో మరొకసారి మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇంకా ఆ తర్వాత టీడీపీ ఎప్పుడు గెలవలేదు. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అక్కడ గెలుస్తూ వస్తుంది. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీకి దగ్గరగా అవకాశం వచ్చింది..గాని 15 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచేసింది.

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి..2019లో వైసీపీలోకి వెళ్ళి పోటీకి దిగారు. దీంతో టీడీపీకి బలమైన అభ్యర్ధి లేకుండా పోయారు. చివరి నిమిషంలో దర్శికి చెందిన శిద్ధా రాఘవరావుని ఒంగోలు పార్లమెంట్ బరిలో నిలిపారు. కానీ అనూహ్యంగా 2.14 లక్షల మెజారిటీతో ఓడిపోయారు. ఆ తర్వాత శిద్ధా కూడా వైసీపీలోకి వెళ్లారు.

దీంతో ఒంగోలు పరిధిలో టీడీపీకి బలమైన నాయకుడు లేరు. ఇప్పటికీ అక్కడ సరైన నాయకుడు దొరకలేదు. అయితే పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ బలం పెరుగుతూ వస్తుంది. ఇలాంటి తరుణంలో పార్లమెంట్‌లో బలమైన నాయకుడు నిలబడితే..ఆ ప్రభావం అసెంబ్లీ స్థానాలపై కూడా ఉంటుంది. ఇదే క్రమంలో మార్కాపురంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తూమాటి వెంకట నరసింహారెడ్డిని ఒంగోలు పార్లమెంట్ బరిలో పెట్టడానికి టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తుందట.

ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది..కాకపోతే ఆయన నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని తెలిసింది. కానీ ఎలాగైనా తూమాటిని ఒప్పించి, ఒంగోలు బరిలో నిలబెట్టి..అక్కడ సత్తా చాటాలని చూస్తున్నారు. రెడ్డి వర్గం నేతని పెడితే..వైసీపీకి చెక్ పెట్టవచ్చని చూస్తున్నారు. ఇప్పటికే కొంతవరకు వైసీపీపై నెగిటివ్ ఉంది..ఈ సమయంలో బలమైన క్యాండిడేట్‌ని నిలబెడితే తిరుగుండదని టీడీపీ భావిస్తుంది. మరి ఒంగోలు ఎంపీగా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఫిక్స్ అవుతారో లేదో చూడాలి.