‘రాజుల’ ఓట్ల వేటలో రోజా..!

ఏపీలో రాజకీయాలు ఎక్కువగా కులాలు ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే..అసలు ఎక్కువగా కాదు..పూర్తిగా అని చెప్పొచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా కులాలని బట్టే రాజకీయం చేస్తుంది. కులాల పరంగా ఓట్లని ఎలా ఆకర్షించాలి..ఏ విధంగా వారికి తాయిలాలు పంచాలనే టెక్నిక్‌లని పార్టీలు బాగా వాడుతాయి. ఇక రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న బీసీ, కాపు, ఎస్సీ ఓటర్లకు గేలం వేసేందుకు ప్రధాన పార్టీలైన వైసీపీ-టీడీపీ-జనసేనలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఇక వీరి కంటే తక్కువ ఉన్నా సరే కమ్మ-రెడ్డి వర్గాలు..రాజకీయాలని బాగా ప్రభావితం చేయగలవు.

అలాగే గోదావరి జిల్లాల్లో రాజుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. వారిని తిప్పుకుంటే కొన్ని స్థానాల్లో సత్తా చాటవచ్చు. అయితే గత ఎన్నికల్లో రాజులు ఎక్కువ శాతం వైసీపీ వైపే మొగ్గు చూపారు. ఫలితంగా రెండు జిల్లాల్లో వైసీపీ అదిరిపోయే విజయాలు అందుకుంది. ఇక ఈ సారి కూడా రాజుల ఓట్లు పోకుండా చూడటానికి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. కాకపోతే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ వైసీపీకి కాస్త ఇబ్బందిగా మారింది.

ఎప్పుడైతే రఘురామ..వైసీపీపై విమర్శలు చేయడం..అలాగే ఆయన టార్గెట్‌గా వైసీపీ ఎలాంటి రాజకీయం చేసిందో అందరికీ తెలిసిందే. ఈ పరిణామాల వల్ల క్షత్రియ వర్గంలో వైసీపీపై కాస్త నెగిటివ్ పెరిగినట్లు కనిపించింది. అయితే ఆ విషయం అధిష్టానానికి కూడా బాగానే అర్ధం అయినట్లు ఉంది. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

ఇటీవల కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే తాజాగా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ జరిగింది..అక్కడికి ప్రభాస్ వచ్చారు..దీంతో పెద్ద ఎత్తున జనం కూడా వచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి రోజా..అక్కడుకు వెళ్ళి ప్రభాస్‌ని, కృష్ణంరాజు భార్యని పరామర్శించారు.  ఇదే క్రమంలో తీర ప్రాంతంలో కృష్ణంరాజు పేర స్మృతివనం ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని రోజా తెలిపారు. అయితే స్ర్మృతివనం ఏర్పాటు చేయడం మంచిదే అని, కానీ అందులో రాజకీయంగా రాజుల ఓట్లని ఆకర్షించే ప్రయత్నం జరుగుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. రోజా ద్వారా రాజుల ఓట్లకు ఎర వేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా గాని రాజకీయ నాయకులు..రాజకీయ ప్రయోజనం లేకుండా ఏ పనిచేయరనే చెప్పొచ్చు.