కడపలో తమ్ముళ్ళ రచ్చ..గెలిచే సీట్లు చేజారేనా..!

సీఎం జగన్ సొంత జిల్లా…వైసీపీ కంచుకోట అయిన ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ పరిస్తితి మెరుగు అవ్వడం లేదు. ఒకవేళ ఒకటి రెండుచోట్ల మెరుగైన సరే..దాన్ని టీడీపీ నేతలే నాశనం చేసేస్తున్నారు. మామూలుగానే కడపలో టీడీపీకి బలం లేదు. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 సీట్లు వైసీపీ గెలిచేసుకుంది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం కనీసం రెండు, మూడు సీట్లు అయిన టీడీపీ గెలవాలని చూస్తుంది. వాస్తవానికి కొన్ని సీట్లలో టీడీపీకి బలం పెరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం కావొచ్చు..సరైన అభివృద్ధి లేకపోవడం, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరగడం, అలాగే టీడీపీ బలపడటం..ఇలా కొన్ని అంశాలు టీడీపీకి కలిసొస్తున్నాయి.

ఇలా టీడీపీకి కలిసొచ్చే స్థానాలు వచ్చి..మైదుకూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు. ఈ నాలుగు చోట్ల టీడీపీకి బలం పెరిగినట్లు కనిపిస్తోంది. కానీ విచిత్రంగా నాలుగు చోట్ల టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. ప్రొద్దుటూరులో సీనియర్ నేత లింగారెడ్డి, ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య వార్ నడుస్తోంది. సీటు తమదంటే తమదని ప్రకటించుకుంటున్నారు. మధ్యలో టికెట్ తమకే అని వరదరాజులు రెడ్డి  వర్గం వాదిస్తోంది. అంటే ఒకవేళ టీడీపీకి గెలిచే ఛాన్స్ ఉన్నా సరే..ఒకరికి టికెట్ ఇస్తే..మరొక వర్గమే ఓడించేలా ఉంది.

మైదుకూరులో టీడీపీ గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయినా సరే ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ్, వెంకట సుబ్బారెడ్డి వర్గాలకు పడటం లేదు. అటు డీఎల్ రవీంద్రా రెడ్డి వర్గం హడావిడి కూడా ఉంది. ఇటు రాజంపేటలో చెంగల్రాయుడుకు వ్యతిరేకంగా కొందరు నేతలు పనిచేస్తున్నారు. రైల్వేకోడూరులో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది. అసలు టీడీపీకి బలం ఎక్కువ ఉన్న రైల్వేకోడూరులో టీడీపీ వరుసగా ఓడిపోవడానికి వర్గ పోరే కారణం. ఇదే పరిస్తితి కొనసాగితే గెలిచే సీట్లు కూడా చేజారిపోతాయి.