పొత్తుల ఎత్తులు…క్రియేట్ చేశారా?

గత కొంతకాలం నుంచి మళ్ళీ బీజేపీకి చంద్రబాబుకు దగ్గరవుతున్నారని, అదిగో ఎన్డీయేలోకి టీడీపీ వెళ్లిపోతుందని..టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఆజాదీ అమృత్ ఉత్సవాల్లో భాగంగా మోదీ- చంద్రబాబు కలిశారు…అదంతా ఫార్మాలిటీకే తప్ప, రాజకీయం లేదు. కానీ దాన్ని టీడీపీ పెద్దగా చేసి చూసుకుంటుంది. ఇంకా బీజేపీతో పొత్తు ఖాయమని, అటు ఎలాగో జనసేన పొత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టేస్తామని అంటున్నారు.

అయితే ఏపీలో ఒక శాతం ఓటు బ్యాంక్ లేని బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి ఒరిగేది ఏముందని అంతా అనుకోవచ్చు…కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సపోర్ట్ ఉంటే రాష్ట్రంలో ఇబ్బంది ఉండదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే వైసీపీకి చెక్ పెట్టాలంటే కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో పొత్తు అవసరం అని భావిస్తున్నారు. కానీ ఈ పొత్తుపై టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నేతలే స్పందిస్తున్నారు తప్ప…బీజేపీ వాళ్ళు స్పందించడం లేదు.

కాకపోతే ఈ పొత్తు గురించి నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయని..టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది. తాజాగా రిపబ్లిక్ టీవీ…బీజేపీ-టీడీపీ పొత్తు గురించి ఓ కథనం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి గట్టి ఓటు బ్యాంకు ఉందని.. తెలంగాణలో దానికి 10-20 శాతం ఓట్లు ఉన్నాయని.. అందుచేత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ సానుకూలంగా ఉందని రిపబ్లిక్ చానల్‌ వెల్లడించినట్లు తెలిసింది.

అయితే జాతీయ చానల్స్ పొత్తు గురించి మాట్లాడుతున్నప్పుడు…బీజేపీ నేతలు పొత్తు లేదన్నట్లే మాట్లాడుతున్నారు… తాజాగా ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ డియోధర్…పొత్తు అంటూ వస్తున్న వార్తలని ఖండించారు. ఇదంతా టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని, ఎవరో మీడియాలో రాస్తే తాము పొత్తులు పెట్టుకుంటామా? అని మాట్లాడారు. మొత్తానికి పొత్తు ఉందని ఎవరో క్రియేట్ చేసినట్లు అర్ధమవుతుంది..మరి నిజంగానే పొత్తు ఉంటుందో లేదో చూడాలి.