రిస్క్‌లో విశాఖ ఎమ్మెల్యేలు..సొంత వాళ్లే..!

ఎమ్మెల్యేలకు ఎక్కడైనా ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురైతే దానికి కాస్త అర్ధం ఉంటుంది…సరే ఎమ్మెల్యేలు సరిగ్గా పనులు చేసి ఉండరు..అందుకే ప్రజలు నిరసనలు తెలియజేశారని అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ నేతలే నిరసన తెలియజేస్తున్నారంటే ఆ ఎమ్మెల్యేల పరిస్తితి ఇంకా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజల దగ్గర నుంచి నిరసనలు వస్తే..ఎలాగోలా కవర్ చేసుకుని మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా సొంత పార్టీ నేతల్లో అసమ్మతి ఉందంటే..అది ఎప్పటికైనా డేంజర్.

సొంత నేతలే..ఎమ్మెల్యేల ఓటమి కోసం పనిచేస్తారు. అలాంటి పరిస్తితిని ఉమ్మడి విశాఖ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు తెచ్చుకుంటున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లలో వైసీపీ 11 సీట్లు గెలుచుకుంది. ఇక వీరిలో దాదాపు 5 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ వచ్చిందని సర్వేల్లో తేలింది. సరే ప్రజా వ్యతిరేకతని పక్కన పెడితే…కొందరు ఎమ్మెల్యేల పనితీరు సొంత పార్టీ నేతలకే నచ్చడం లేదు. అలాంటి వారికి నెక్స్ట్ గెలవడానికి రిస్క్ ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.

మొదట పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై ప్రజల్లో వ్యతిరేకత పక్కన పెడితే..సొంత పార్టీలోనే ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తోంది. ఈయన సొంత నేతలనీ పట్టించుకోకుండా, తనకు కావాల్సిన వాళ్ళని వెంటేసుకుని రాజకీయం చూస్తున్నారు. దీంతో మిగతా నేతలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు. అలాగే ఎస్.రాయవరం ఎంపీపీ సైతం ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా రాజీనామా కూడా చేశారు.

ఇటు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ పరిస్తితి కూడా అంతే..తాజాగా నియోజకవర్గంలో పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఇక భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి పరిస్తితి కూడా అంత ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎమ్మెల్యేలు రిస్క్ లో ఉన్నట్లు తెలుస్తోంది.