సర్వే: నిజంగానే టీడీపీ గ్రాఫ్ పెరిగిందా?

ఎన్నికల సీజన్ మొదలు కావడంతో రాష్ట్రంలో సర్వేల జోరు మొదలైంది…ఇప్పటికే పలు సర్వే సంస్థలు రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే ప్రధాన పార్టీలు సైతం తమ సొంత సర్వేలని చేయించుకుంటున్నాయి. ఇక ఆ మధ్య జాతీయ సర్వేలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. వరుసగా వచ్చిన జాతీయ సర్వేల్లో మళ్ళీ వైసీపీదే అధికారమని తేలింది.

ఇక తాజాగా ఆత్మసాక్షి సంస్థ ఏపీకి సంబంధించి అధికారికంగా ఓ సర్వే రిలీజ్ చేసింది. ఆత్మసాక్షి మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో సర్వే చేసినట్లు చెబుతోంది. జూన్ 2 నుంచి సెప్టెంబ‌ర్ 3 వరకు మూడు విడ‌త‌లుగా ప్రజాభిప్రాయం సేకరించామని.. ఈ స‌ర్వే ప్ర‌కారం టీడీపీ 95 స్థానాల్లోనూ, వైసీపీ 75, జ‌న‌సేన 5 స్థానాల‌ను కైవ‌సం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతోంది. మూడు విడ‌త‌లుగా ఒక ల‌క్షా 37వేల 700 శాంపిల్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించామంటోంది.

ఆత్మసాక్షి సర్వే ప్రకారం…టీడీపీకి 44.5 శాతం ఓట్లు, వైసీపీకి 43 శాతం ఓట్లు, జనసేనకు 9, కాంగ్రెస్-బీజేపీ-ఇతర పార్టీలకు కలిపి 2 శాతం ఓట్లు, సైలెంట్ ఓటర్లు 1.5 శాతం ఉన్నారని చెప్పింది. అయితే ఈ సర్వే టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేస్తే వచ్చే సర్వే ఫలితాలు అని చెబుతున్నారు. మరి కలిసి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం.

కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చే సర్వేలు పూర్తిగా నిజమవుతాయని చెప్పలేం…ఎందుకంటే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది…ఎన్నికలకు ఒకరోజు ముందు కూడా జనాభిప్రాయం మారిపోవచ్చు. పైగా జాతీయ సర్వేలు ఏమో వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి…ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే టీడీపీకి అనుకూలం ఉంది. ఈ సర్వేలని చూసి తిరుగులేదు అనుకుంటే పార్టీలే నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సర్వేలని పట్టించుకోకుండా పనిచేస్తేనే ఫలితాలు ఉంటాయి. మొత్తానికైతే ఈ సర్వే టీడీపీకి కాస్త ఊపు ఇస్తుందని చెప్పొచ్చు.