ఎమ్మెల్సీ పోరు: బీజేపీకి బాబు హెల్ప్?

ఇప్పటివరకు ఏపీలో జరిగిన అన్నీ ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే…టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా..పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, పలు ఉపఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అయితే ఏ ఎన్నికలైన వైసీపీకి అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో మరి కొన్ని నెలల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పెద్దగా పోటీ చేయవు.

ఏదో అప్పుడప్పుడు మాత్రమే పోటీకి దిగుతాయి…కానీ ఈ సారి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే  వైసీపీ…ఉత్తరాంధ్ర స్థానానికి ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్‌ను ఎంపిక చేసింది. అలాగే ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానానికి సంబంధించి గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యాంప్రసాద్‌రెడ్డిని,  ఉమ్మడి కర్నూలు–కడప– అనంతపురం గ్రాడ్యుయేట్‌ స్థానానికి సంబంధించి వెన్నపూస రవి పేరు ఖరారు చేసింది.

ఇటు టీడీపీ సైతం..దక్షిణ కోస్తా స్థానానికి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన కంచర్ల శ్రీకాంత్‌ను ఎంపిక చేశారు. రాయలసీమ ప్రాంత స్థానానికి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన రాంగోపాల్‌రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. ఉత్తరాంధ్ర స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇప్పటికే పలువురి పేర్లని పరిశీలిస్తుంది. ఇదే క్రమంలో ఉత్తరాంధ్ర సీటులో బీజేపీ తరుపున ఎమ్మెల్సీ మాధవ్ పోటి చేయడానికి రెడీ అవుతున్నారు. బీజేపీకి జనసేన మద్ధతు ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఉత్తరాంధ్రలో టీడీపీకి పట్టు ఎక్కువ ఉంది…గతంలో 2017లో జరిగిన ఎన్నికలో టీడీపీ మద్ధతుతోనే బీజేపీ తరుపున మాధవ్ పోటి చేసి గెలిచారు. కానీ ఈ సారి టీడీపీ సెపరేట్ గా పోటి చేస్తే బీజేపీకి గెలిచే ఛాన్స్ లేదు. ఇలాంటి పరిస్తితుల్లో బీజేపీ…చంద్రబాబు హెల్ప్ తీసుకుంటుందా? లేక సింగిల్ గానే ముందుకెళుతుందా? అనేది చూడాలి.