టీమిండియాలో కరోనా కలకలం.. రవిశాస్త్రికి కోవిడ్-19 పాజిటివ్..!

ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. భారత జట్టుకు ప్రధాన కోచ్ అయిన రవి శాస్త్రి తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు. శనివారం సాయంత్రం ఆయనకు కోవిడ్ టెస్టు నిర్వహించగా.. అందులో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో టీమిండియా జట్టు అప్రమత్తమైంది. రవిశాస్త్రి ఇప్పటికే ఐసోలేష‌న్ లోకి వెళ్లిపోయారు. ఆయనతోపాటు సహాయక సిబ్బందిలోని ముగ్గురు కూడా హోటల్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌లోకి వెళ్లారని బీసీసీఐ తెలిపింది.

రవిశాస్త్రితో సహా ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న క్రికెట్ ఆటగాళ్లు ఇప్పటికే కరోనా రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. కానీ రవిశాస్త్రి అనూహ్యంగా కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన క్రికెట్ నిర్వాహకులు వెంటనే శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే వీరిలో ఎవరికి కూడా కరోనా పాజిటివ్ గా తేలలేదు. దాంతో క్రికెట్ మ్యాచ్ లకు ఎలాంటి అంతరాయం కలగలేదు.