పాలి’ట్రిక్స్‘ లో ప్రశాంత్ కిశోర్..

ప్రశాంత్ కిశోర్.. రాజకీయవర్గాల్లో ఎప్పుడూ నానుతూ ఉండే పేరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లేక ఎన్నికలు సమీపిస్తున్నా ప్రశాంత్ కిశోర్ (పీకే) పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు బీజేపీకి మద్దతుగా నిలిచి మోదీని అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి సర్వశక్తులూ ఒడి అనుకున్నది సాధించి.. ఆ తరువాత జగన్ వైపు వచ్చి ఆయననూ సీఎం సీటుపై కూర్చోబెట్టారు. ఆ తరువాత చాలా మంది ఈయన మద్దతు తీసుకొని విజయం సాధించారు. తెలంగాణలో కూడా వైటీపీ అధ్యక్షురాలు షర్మిల పీకే టీమ్ సపోర్ట్ తీసుకుంటోంది. ఇపుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ వంతు వచ్చినట్లుంది. అందుకే పీకే గురించి ఆలోచిస్తూ.. ఆయన ఆలోచనలు అమలు చేసి హస్తినలో హవా నడపాలని భావిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఇవ్వనున్నట్లు సమాచారం.

పార్టీలో పీకే చేరిక ఖరారైనా ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలు మాత్రం అధినేత్రి సోనియాగాంధీకే పార్టీ వదిలేసింది. అయితే పీకే సపోర్ట్ తీసుకునే విషయంలో కొందరు కాంగ్రెస్ సీనియర్లు, తల పండిన పెద్దలు వ్యతిరేకిస్తున్నారట. ఇంత పెద్ద జాతీయ పార్టీ, ఇంతమంది తలపండిన నాయకులున్న పార్టీ కేవలం ఒక వ్యక్తిని నమ్మి.. ఆయన ఆలోచనలు ఎలా అమలు చేస్తాం అని ప్రశ్నిస్తున్నారట. వీరి ఆందోళన ఎలా ఉన్నా హై కమాండ్ మాత్రం పీకేకు గ్రీన్ సిగ్నల్ కాదు పెద్ద ప్యాకేజీనే ఇచ్చినట్లు తెలిసింది. రెండు పర్యాయాలు అధికారం కోల్పోవడంతో పాటు మూడోసారి కూడా పవర్ లోకి రాకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుందోనని సోనియా ఆందోళన. ఈసారి కూడా ఢిల్లీలో జెండా ఎగరేయకపోతే రాహుల్ గాంధీ రాజకీయ జీవితం ప్రశ్నార్థకమవుతుందని సోనియా ఫీలవుతోందట. అందుకే పీకే ప్లాన్స్ పార్టీలో అమలు చేస్తారట.