ఒకే ఫ్రేమ్ లో అన్నాచెల్లెలు.. అయినా మాటల్లేవ్..

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ.. జగన్ పార్టీ అధ్యక్షుడు, సీఎం.. . తెలంగాణలో వైటీపీ షర్మిల అధ్యక్షురాలు.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు పిల్లలు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. అయితే ఈ అన్నాచెల్లెళ్ల మధ్య అభిప్రాయాలు వచ్చాయని ఇటీవల కాలంలో మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలొచ్చాయి. అవి నిజమే అన్నట్లు జగన్, షర్మిల కూడా ప్రవర్తించారు. షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ అన్నాచెల్లెలు ఎడమొహం..పెడమొహంగా ఉన్నారు. కనీసం రక్షా బంధన్ రోజైనా ఈ ఇద్దరూ కలుస్తారని అందరూ భావించారు. అయితే అలాంటిదేం జరగలేదు. షర్మిల తన అన్నకు, సహకరించిన సోదరులకు రక్షా బంధన్ శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇక వైఎస్ విజయమ్మ కూడా ఎవరికీ ఏమీ చెప్పలేక అలా ఉండిపోయారు. సెప్టెంబరు 2.. వైఎస్ వర్ధంతి.. ఈ రోజు ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అభిమానులకు కాస్త ఊరటనిచ్చే విషయం.

అయితే విచిత్రమేమంటే.. ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం. తండ్రికి పక్కపక్కనే కలిసి నివాళులర్పించినా ముభావంగానే ఉండిపోయారు. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద ఏపీ సీఎం జగన్, వైటీపీ అధ్యక్షురాలు షర్మిల కలిసి తండ్రికి నివాళులర్పించారు. రాజకీయంగా అభిప్రాయభేదాలున్నా.. తాము కుటుంబపరంగా ఒకటేనని.. తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని ప్రజలకు పరోక్షంగా చెప్పేందుకే ఇలా చేసి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ తరువాత షర్మిల తన ట్విట్టర్ ద్వారా ఒంటరినయ్యా.. అంటూ పేర్కొనడాన్ని చూస్తుంటే వారి మధ్య పొరపచ్చాలు ఇంకా తొలగిపోలేదని అర్థమవుతోంది.