17న అమిత్ షా షో.. పార్టీకి కలిసి వచ్చేనా..?

టీబీజేపీ చీఫ్ పాదయాత్రలో బుల్లెట్ లా దూసుకుపోన్నాడు. ప్రచారం వచ్చినా.. రాకపోయినా.. ప్రసంగాలు మీడియాలో అంతంత మాత్రంగా కనిపిస్తున్నా జోరు తగ్గడం లేదు. కార్యకర్తల మద్దతుతో, అధిష్టానం ఆశీస్సులతో ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి, పార్టీ అగ్ర నేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు అనే వార్త బండిలో మరింత జోష్ నింపింది. ఈనెల 17న బీజేపీ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవానికి అమిత్ షా హాజరవుతారని ఢిల్లీలోని ఆయన పార్టీ కార్యాలయం రాష్ట్ర పార్టీకి సమాచారం పంపింది. చాలా రోజులుగా రాష్ట్రంలో సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం ఈ డిమాండును పట్టించుకోవడం లేదు. మీరు చెప్పేదేంది అన్నట్లు ఆయన పెడచెవిన పెట్టారు. ఎన్నిసార్లు కోరినా సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఏకంగా కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలోనే వేడుకలు జరపాలని టీ.బీజేపీ ప్లాన్ చేసింది. అలా చేస్తే కేసీఆర్ ను ఇరుకున పెట్టినట్లవుతుంది.. కేంద్ర మంత్రి వేడుకలకు వచ్చారు కాబట్టి అనధికారికంగా కేంద్ర ప్రభుత్వం విమోచనానికి మద్దతు తెలిపినట్లవుతుంది.. హుజూరాబాద్ ఎన్నికలకు ఇది పాజిటివ్ అవుతుందని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. అమిత్ షా పర్యటనను ఢిల్లీ మంగళవారం ఖరారు చేయడంతో స్థానిక నాయకులు ఏర్పాట్లపై దష్టి సారించారు.

నిర్మల్ లో భారీ సభ

ఈనెల 17న షా ప్రోగ్రామ్ నిర్మల్ లో జరిపేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కూడా ఆ రోజుకు నిర్మల్ చేరుకునేలా షెడ్యూల్ రూపొందించింది. అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు ఢిల్లీ నేతలు సంసిద్ధులయ్యారు. ఈ సభ అనంతరం హుజూరాబాద్ పార్టీలో జోష్ వస్తుందని.. అక్కడ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కమలం నేతలు ఊహించుకుంటున్నారు.అయితే వారి కలలు నిజమవుతాయో, కలలుగానే ఉండిపోతాయో వేచి చూడాలి.