వార్తల్లో మళ్లీ జస్టిస్ కనగరాజ్..

జస్టిస్ కనగరాజ్.. ఈ పేరు గుర్తుందా.. కరోనా కాలంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న ఫళంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి. నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్న సమయంలోనే కనగరాజ్ ను ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ ఈసీగా కొనసాగారు. ఇది గతం.. ఇప్పుడు మళ్లీ జస్టిస్ కనగరాజ్ పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆయన పేరు దాదాపుగా అందరూ మరచిపోయిన సమయంలో ఏపీ ప్రభుత్వం ఆయనపై ఉన్న ప్రేమను చాటుకుంది. ఏపీ పోలీసు ఫిర్యాదుల అథారిటీ చైర్మెన్ గా మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి (కనగరాజ్)ను నియమించింది. ఈ యేడాది జూన్ 20న ఆయన నియామకానికి సంబంధించిన జీఓ 57 సర్కారు విడుదల చేసింది. అయితే ఆయనకు వయసు మీరిపోయిందని.. ఎలా నియమిస్తారని కిశోర్ అనే న్యాయవాది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా కనగరాజ్ ను సర్కారు నియమించిందని, చైర్మెన్ సీటులో కూర్చోవాలంటే 65 ఏళ్లు వయసులోపే ఉండాలని, అయితే కనగరాజ్ కు 78 సంవత్సరాలున్నాయని కిశోర్ పిటిషన్ లో పేర్కొన్నారు. కనగరాజ్ ను గతంలో సర్కారు ఎస్ఈసీగా నియమించింది.. అయితే హైకోర్టు అప్పట్లో ఆ నియామకాన్ని రద్దు చేసింది.. అయినా జగన్ సర్కారు ఈయనను మళ్లీ ఏపీకి తెచ్చింది. సీఎంతో మాజీ న్యాయమూర్తికి ఉన్న సాన్నిహిత్యం వల్లే ఇలా చేశారు.. పరిశీలించి నియామకాన్ని రద్దు చేయండి అని హైకోర్టును కోరారు.

ఏపీ పోలీసు ఫిర్యాదుల అథారిటీ అంటే..

రాష్ట్రంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆపై స్థాయి పోలీసు అధికారులపై అనేక ఫిర్యాదులు, ఆరోపణలు వస్తుంటాయి. వాటిని ఈ అథారిటి విచారించనుంది. పోలీసు కస్టడీలో చనిపోవడం, దుష్ప్రవర్తన, లైంగికదాడి లాంటివి జరిగినప్పుడు చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీ విచారణ జరుపుతుంది.