ఏపీకి మరో సలహాదారు నియామకం..

ఏపీలో ప్రభుత్వ సలహాదారులు ఇంతమందా అని కోర్టే గతంలో ఆశ్చర్యపోయింది. అసలు వాళ్లేం సలహాలిస్తున్నారు అని ప్రశ్నించింది. ఇది గడిచిన తరువాత జూపూడి సలహాదారుగా నియమితులయ్యారు. తాజాగా మరోవ్యక్తి కూడా సలహాదారుడిగా వచ్చి చేరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం రజనీష్ కుమార్ ను ఆర్థిక సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించింది. ఈయన ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు ఉంటారు. ఎస్బీఐ చైర్మన్ గా పనిచేసిన రజనీష్ 2006లో రిటైర్డ్ అయ్యారు. హాంకాంగ్, షాంగై బ్యాంకులకు డైరెక్టరుగా కూడా వ్యవహరించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్న క్రమంలో దానిని గాడిన పెట్టేందుకు ఈ నియామకం చేపట్టి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం అనే వ్యవస్థలో అనేక మంది అధికారులుంటారు.. మేధావులు ఉంటారు.. ఆర్థిక నిపుణులు ఉంటారు.. ఇంతమందిని కాదని మరోవ్యక్తిని తెచ్చి ఆర్థిక సలహాదారుగా నియమించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

పరిచయాలను ఉపయోగించుకునేందుకే..

ఎస్బీఐ చైర్మన్ గా పనిచేసిన రజనీష్ కు బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవముంది. ఇతర బ్యాంకులతో సత్సంబంధాలుంటాయి. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. బ్యాంకర్లను ఎవరూ ఒప్పించలేకపోతున్నారు. దీంతో రజనీష్ ను సలహాదారుగా నియమిస్తే బ్యాంకర్లను కన్విన్స్ చేసి రుణాలిప్పించగలడని ప్రభుత్వం భావిస్తోంది. ఎలాగైనా ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని సర్కారు భావిస్తోంది. సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుండటంతో మిగతా పనులకు డబ్బులెలా సర్దాలో ప్రభుత్వ పెద్దలకు అర్థంకాక ఇలా చేసి ఉంటారు.