కేసీఆర్ ను ఫాలో కావాలంటున్న కుమారస్వామి

కర్ణాటకలో రెండు రోజుల క్రితం ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన సామూహిత అత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి, మహిళా సంఘాలు, నాయకులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్ కౌంటర్ చేసినట్లు కర్ణాటకలో కూడా చేయాలనే డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ చేసే వారిలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చేరారు. ఆయన ఓ అడుగు ముందుకేసి సజ్జనార్ బాటలో నడవాలని ఆ రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఓ విద్యార్థినిని అంత దారుణంగా లైంగిక దాడిచేస్తే పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉన్నారనే విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ విషయంలో ఇటీవల కొత్తగా ఏర్పడిన బొమ్మయ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఎన్ కౌంటర్ చేయాలని పరోక్షంగా సూచించారు. హైదరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలను కర్ణాటకలో నిందితలపై తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అంటే ఎన్ కౌంటర్ చేయాలన్నది ఆయన భావన.

శంషాబాద్ లో దిశపై లైంగికదాడి, హత్య జరిగిన తరువాత ముగ్గురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో రాష్ట్రంలో కాస్త శాంతిభద్రతలు ఉన్నాయని ప్రజలు భావించారు. ఆందోళన కారులు కూడా శాంతించారు. అయితే ఈ ఎన్ కౌంటర్ కేసు ఇపుడు విచారణకు వచ్చింది. ఎన్ కౌంటర్ జరిగింది సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హయాంలో.. ప్రభుత్వం అనధికారికంగా ఎన్ కౌంటర్ కు అనుమతి ఇచ్చినా అధికారికంగా మాత్రం సజ్జనార్ చేయించినట్లే అని రికార్డుల్లో ఉంటుంది. ఈ కేసు విచారణకు రానుండటం వల్లే ఆయనను ఉన్నట్టుండి ఆర్టీసీ ఎండీగా నియమించి సీపీ పోస్టు నుంచి తప్పించారు అనే వాదనలు కూడా వినిపించాయి. మరి విచారణలో పోలీసు అధికారులు ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఏది ఏమైనా మహిళలపై దారుణంగా లైంగిక దాడిచేసి హత్యచేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై ప్రజల్లో గౌరవం పెరిగిందనేది వాస్తవం.