బుచ్చయ్య రాజీనామా వెనుక ఎన్టీఆర్ ?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ ఆవిర్భావం ఉంచి ఉన్న నేత, సీనియర్ ఎమ్మెల్యే (రాజమండ్రి రూరల్) గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేస్తానని ప్రకటించిన అనంతరం పార్టీలో కలకలం రేగుతోంది. అరె.. అంతమంచి నాయకుడు పార్టీని వీడిపోతే ఎలా? అధినేత ఏం పట్టించుకోవడం లేదెందుకు అని కేడర్ వాపోతోంది. బుచ్చయ్య పార్టీని వీడటం వెనుక కారణం జూనియర్ ఎన్టీఆర్ పేరని తెలిసింది. ప్రత్యక్షంగా ఆయన రాజకీయాల్లో వేలుపెట్టకపోయినా.. ఫ్యాన్స్ మాత్రం పార్టీ పగ్గాలు చేపట్టాలని చాలా రోజులుగా కోరుతున్నారు. అలాంటి వారిలో బుచ్చయ్య కూడా ముందున్నారు. పార్టీని జూనియర్ కు అప్పగిస్తే మేలని పలుసార్లు సన్నిహితులతో అభిప్రాయపడినట్లు తెలిసింది. దీనికి తోడు పార్టీలో చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేకపోవడంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీనియర్ మోస్ట్ నాయకుడు బాధతో పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

అయితే వీడటానికి గల కారణాలను మాత్రం ఆయన చెప్పలేదు. సరైన సమయంలో అన్నీ చెబుతాను.. మీ అంతకు మీరే ఏమేమో ఊహించుకోకండి అని మీడియాతో కూడా చెప్పారు. ఆయన కారణాలు చెప్పకపోయినా మీడియా మాత్రం అందుకు రీజన్స్ వెతకడం మొదలుపెట్టింది. మాజీ మంత్రి నిమ్మకాలయ చినరాజప్ప ను దూతగా చంద్రబాబు పంపినా బుచ్చయ్య పెద్దగా స్పందించలేదని తెలిసింది. చంద్రబాబు కూడా పట్టీపట్టనట్లే ఉన్నారని, పదే..పదే బుచ్యయ్య ఎన్టీఆర్ నామజపం చేస్తుంటే చంద్రబాబుతోపాటు లోకేష్ కూడా ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా బుచ్చయ్య రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తార? చేస్తే తరువాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అతని ముందున్న ఆప్షన్స్ ఏంటి? టీడీపీ మళ్లీ టికెట్ ఇస్తుందా? ఇవ్వకపోతే ఎలా? ఉప ఎన్నికలు నిర్వహిస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తారా? లాంటి ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నింటికీ సమాధానం కావాలంటే బుచ్చయ్య నోరు విప్పాల్సిందే కదా..