షర్మిలకు షాక్.. ఇందిరా శోభన్ అవుట్..

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత ఆమె పార్టీకి పెద్ద షాక్ తగిలింది. వైఎస్ఆర్టీపీ అధికర ప్రతినిధి ఇందిరా శోభన్ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈమె నిర్ణయంతో షర్మిల పార్టీలో అయోమయం నెలకొంది. వైటీపీ నుంచి బయటకు వచ్చిన వారిలో ఈమె రెండో లీడర్. గతంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రతాప రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఇద్దరి రాజీనామాతో పార్టీలో ఏం జరుగుతుందో కార్యకర్తలకు, పార్టీ నాయకులకు అంతుచిక్కకుండా ఉంది. ఇందిరా శోభన్ పార్టీలో చేరింతి మార్చి మొదటి వారంలోనే. మొదట్లో ఆమె పార్టీలో చురుగ్గా వ్యవహరించేవారు. అయితే ఏమైందో.. ఏమో రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా ఆమె పార్టీని వీడుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చలు కూడా జరిగాయి. అయితే వాటిని ఇందిరా ఖండించలేదు.

ఇటీవల కాలంలో ఆమె పార్టీలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని తెలిసింది. ఆమెను పార్టీలో కొందరు కార్నర్ చేసినట్లు సమాచారం. పార్టీ తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా వైటీపీలో ఇందిరా శోభన్ కు బాధ్యతలు కూడా అప్పగించలేదు. మరో విషయమేమంటే.. వైటీపీకి రాజీనామా చేసిన ఇందిరా కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరనున్నట్లు తెలిసింది. గతంలో ఈమె కాంగ్రెస్ పార్టీనుంచే బయటకు వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నపుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె తన అసంత్రుప్తిని వెలిబుచ్చారు. ముఖ్యంగా ఆమె రేవంత్ రెడ్డికి మద్దుతుగా నిలిచారు. ఇపుడు రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏం జరుగబోతోందో ఆమెకే తెలియాలి మరి.ఇదిలా ఉండగా ఇందిరా శోభన్ కు పార్టీ చీఫ్ షర్మిల ఫోన్ చేసి దాదాపు అరగంటపాటు బుజ్జగించారని తెలిసింది.