‘వరల్డ్ ఎమోజీ డే’ స్పెషల్ స్టోరీ.. ఎమోజీలు ఎలా పుట్టుకొచ్చాయో తెలుసా..?

ఎమోజీలు

ఎమోజీల గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. మన భావోద్వేగాలను ఎదుటివారిని మాటలు, రాత రూపంలో చూపించనప్పుడు ఎమోజీల రూపంలో పంపిస్తుంటాము. ప్రస్తుత టెక్నాలజీ జీవితంలో ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా పెరిగింది. ఫన్నీగా చాట్ చేసుకోవడానికి ఎమోజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎమోజీలతో ఫన్నీ చాటింగ్, లవ్, భావోద్వేగం వంటి స్టిక్కర్లు తదితర వాటిని పంపిస్తుంటారు. సాధారణంగా చాలా మంది తమ భావోద్వేగాలను ఎమోజీల రూపంలో వ్యక్త పరుస్తుంటారు. మాటలు, టెక్ట్స్ అవసరం లేకపోవడంతో ఎమోజీలు బాగా పాపులర్ అయ్యాయి. అందుకే జూలై 17వ తేదీన ప్రపంచ ఎమోజీ డేగా జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఎమోజీల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

 

అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘బంబుల్ వరల్డ్’ ఎమోజీ డే సందర్భంగా ఎమోజీలను ఎక్కువగా ఎందుకు వినియోగిస్తున్నారనే విషయంపై సర్వే నిర్వహించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా గతేడాది నుంచి ఎమోజీల వాడకం 86 శాతం పెరిగిందని, సోషల్ మీడియా, ఇతర సైట్లలో ఎమోజీలు యాక్టీవ్‌గా ఉన్నట్లు వారు గుర్తించారు. 22 నుంచి 37 ఏళ్ల వయస్సు ఉన్న యువత ఎమోజీలు అత్యధికంగా వాడుతున్నారని తెలిపింది. ప్రస్తుతం ఇండియన్స్‌కు చెందిన క్లాసిక్ రెడ్ హార్ట్ ఎమోజీ టాప్-5లో కొనసాగుతోందన్నారు. రెడ్ హార్ట్, కన్నీళ్లు పెట్టే ఎమోజీ, కన్ను కొట్టేది, సన్ గ్లాసెస్ ఎమోజీ, కళ్లతో స్మైల్ ఇచ్చే ఎమోజీలు ఎక్కువగా వాడుతున్నారని తెలిపింది. అధికశాతం నెటిజన్లు రెడ్ హార్ట్ ఎమోజీని వినియోగిస్తున్నట్లు బంబుల్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వెల్లడించారు.

 

అబ్రహం లింకన్ వల్లే..

ఎమోజీలు మొదటిసారిగా అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. 1862లో ఆయన ఒక ప్రసంగంలో మాట్లాడిన మాటలు, హావాభావాలు అభిమానులను ఎంతగానే ఆకట్టుకున్నాయి. అందులో కన్ను కొట్టేది చాలా పాపులర్ అయింది. అప్పట్లోనే పలు మీడియా సంస్థలు తమ న్యూస్ పేపర్లలో ఆయన ప్రసంగం పక్కనే కన్నుకొట్టే ఎమోజీలను పెట్టేవారట. అలా ఎమోజీలు వాడుకలోకి వచ్చినట్లు పలువురు చెబుతున్నారు.

 

ఆ తర్వాత యాహూ మెయిల్, యాహూ మెసెంజర్‌లలో వాడేవారు. ఆ తర్వాత జీమెయిల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో అందుబాటులోకి వచ్చాయి. 2010 తర్వాత ఈ ఎమోజీలు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా చేరాయి. అయితే ఈ ఎమోజీలను జపాన్ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్‌టీటీ డొకామో’లో పని చేసిన షిగెటకా కురిటా అనే ఇంజినీర్ రూపొందించారు.

 

బంబుల్ నివేదిక ప్రకారం..

ఎమోజీల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల ఆయా కంపెనీలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ప్రస్తుతం వాయిస్‌ను సెండ్ చేస్తే దానికి డీఫాల్ట్‌గా ఎమోజీ రెడీ అయ్యేలా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎమోజీలను ఎవరు పడితే వారు మార్కెట్‌లో రిలీజ్ చేయలేరు. యూనికోడ్ కన్సార్టియం ఆమోదం పొందిన తర్వాతే వీటిని మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తారు. అప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తమ మొబైళ్లలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తారు. ఇందులో ఫేస్‌బుక్, గూగుల్, టిండర్, ట్విట్టర్, నెట్‌ఫ్లిక్స్ తదితర సంస్థలు సభ్యులుగా ఉంటారు.