అమ్మా లక్ష్మీపార్వ‌తీ… డ‌బుల్ టంగ్ కామెంట్లు ఎందుక‌మ్మా?!

అన్న‌గారు ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీపార్వ‌తి తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  త‌న పై సినిమా తీస్తున్న వారి గురించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.  అయితే, ఈ విష‌యంలోనే ల‌క్ష్మీపార్వ‌తి రెండు నాల్క‌ల ధోర‌ణిని అవ‌లంబిస్తున్నార‌ని నెటిజ‌న్లు  విరుచుకుప‌డుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. అన్న‌గారి జీవిత చ‌రిత్ర ఆధారంగా మొత్తం మూడు సినిమాలు తెరంగేట్రం చేయ‌నున్నాయి. వీటిలో ఒక‌టి బాల‌య్య‌, రెండు వ‌ర్మ‌, మూడు  కేతిరెడ్డి ఉన్నారు. వీరంతా ఎన్టీఆర్ జీవితంలో వివిధ కోణాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు అటు బాల‌య్య మూవీకి కానీ, ఇటు రాంగోపాల్ వ‌ర్మ మూవీకి కానీ ల‌క్ష్మీపార్వ‌తి అభ్యంతరం చెప్ప‌లేదు. 

కానీ, కేతిరెడ్డి మూవీ  ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ విషయంలో మాత్రం ల‌క్ష్మీ పార్వ‌తి ఫైరైపోతున్నారు.  ఎన్టీఆర్ జీవితంలో అనేక కోణాలు ఉన్నాయి. ఒక‌టి సినిమాలు, రెండు రాజ‌కీయం, మూడు మ‌ళ్లీ పెళ్లి. ఈ మూడు కోణాల్లోనూ అనేక ట్విస్టులు ఉన్నాయి. అయితే, వ‌ర్మ తీయాల‌నుకున్న మువీలో చంద్ర‌బాబును విల‌న్‌గా చూపించ‌నున్నాడ‌న్న విష‌యం ఇప్ప‌టికే వెల్ల‌డైంది. దీంతో ల‌క్ష్మీపార్వ‌తి ఎగిరి గంతేశారు. అంతేకాదు, ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా తాను సాయం చేస్తాన‌ని, అన్ని అనుమ‌తులూ తానే ఇస్తాన‌ని చెప్పుకొచ్చారు. 

ఇక‌, బాల‌య్య మూవీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఎన్టీఆర్ త‌న‌యుడే కాబ‌ట్టి.. ఎక్క‌డా అస‌భ్యంగా చిత్రీక‌రించే ఛాన్స్‌లేదు. సో.. దీనికి కూడా ల‌క్ష్మీపార్వ‌తి అడ్డు చెప్ప‌లేదు. అయితే, మూడో వ్య‌క్తి కేతిరెడ్డి  తీస్తున్న ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం- మూవీపైనే ల‌క్ష్మీపార్వ‌తి ఫైర‌య్యారు. పేర్లు ఎత్తకుండా ఈ సినిమా తీస్తున్న వారిపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైల్వే ఫ్లాట్ ఫాం మీద పడుకునేవాళ్లు.. నిండా అప్పులతో మునిగిపోయిన వాళ్లు నా మీద సినిమా తీస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఈ సినిమా తీయాలనుకుంటున్న వాళ్ల అర్హతలేంటి అని ఆమె ప్రశ్నించారు.

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా తీయడంలో వీరి వెనుక కొన్ని అదృశ్య శక్తులు పని చేస్తున్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సినిమా తీసే పేరుతో వీళ్లందరూ కలిసి డ్రామాలు నడిపిస్తున్నారని.. దీని వెనుక అసలు గుట్టేంటో.. వీళ్లను నడిపిస్తున్నది ఎవరో త్వరలోనే బయటపెడతానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. తాను 25 ఏళ్ల కిందటే విడాకులు తీసుకున్న వ్యక్తితో ఇప్పుడు ముడిపెట్టి సినిమా తీయడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకుండా చూస్తానని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇక్క‌డే ల‌క్ష్మీపార్వ‌తి రెండు నాల్క‌ల ధోర‌ణి బ‌య‌ట‌ప‌డింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు . మూవీని మూవీగా ఎంజాయ్ చేయాల‌ని గ‌తంలో ఆమె చెప్పార‌ని, ఇప్పుడు ఇలా త‌న‌కు సెగ త‌గిలేప్ప‌టికి ఆ నీతులు ఏమైపోయాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.