జ‌గ‌న్‌పై టీడీపీ అంచ‌నాలు తారుమారు!

ఇప్పుడు ఈ కామెంట్లు వైసీపీ సోష‌ల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. జ‌గ‌న్‌ను టైగ‌ర్‌తో పోలుస్తూ.. ప‌లువురు పోస్టింగులు దంచికొడుతున్నారు. దీనికి కార‌ణం.. నంద్యాల‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో అతి పెద్ద దెబ్బ త‌గిలిన వైసీపీ ఇక నామ‌రూపాలు లేకుండా పోతుంద‌ని, ఆ పార్టీ ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన టీడీపీ పెద్ద‌ల‌కు జ‌గ‌న్ షాకివ్వ‌డ‌మే. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక‌ను జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. గెలుపు త‌థ్యం అనుకున్నాడు. శ‌క్తికి మించి ప్ర‌చారం చేశాడు. ఓ రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడిని అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ ప్ర‌చారం చేశాడు. అయినా కూడా ఓట‌మి త‌ప్ప‌లేదు.

దీంతో టీడీపీ వైసీపీ ప‌ని అయిపోయింది. జ‌గ‌న్ ఓడిపోయాడు కాబ‌ట్టి కోలుకోవ‌డం క‌ష్టం. ఇక వైసీపీ నామ రూపాలు లేకుండా పోతుంది. అనుకున్నారు టీడీపీ త‌మ్ముళ్లు. కానీ, దీనికి భిన్నంగా జ‌గ‌న్ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేశాడు. నంద్యాల‌, కాకినాడ రిజ‌ల్ట్ వ‌చ్చి ప‌ట్టుమ‌ని ప‌దిరోజులు కూడా కాక‌ముందే.. జ‌గ‌న్ మ‌ళ్లీ బాబుపై యుద్ధం ప్ర‌క‌టించేశాడు. విప‌క్ష నేత‌గా త‌న వాగ్ధాటిని కొన‌సాగిచేస్తున్నాడు. నిజానికి నంద్యాల ప‌రాభ‌వంతో జ‌గ‌న్ మాట‌ల దూకుడు త‌గ్గుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా నిన్న ఇడుపుల పాయ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాడు జ‌గ‌న్‌.

2019 ఎన్నికలనే టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్లాలని జగన్ నిన్న కార్య‌క‌ర్త‌ల‌కు నూరిపోశాడు. రేపటి నుంచి 9వ తేదీ వర‌కు వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబం పేరుతో ప్రజలతో మమైకమయ్యే కార్యక్రమాన్ని కూడా వైసీపీ చేపట్టబోతోంది. ఈ సందర్భంగా అధికార పార్టీ వైఫల్యాలపై ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేయానున్నారు.ఇప్పటికే పులివెందులలో వైసీపీ అధినేత జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో నవరత్నాల పేరిట సభను నిర్వహించి జగన్ హామీలను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి అటు నంద్యాల‌, ఇటు కాకినాడ ఎన్నిక‌ల్లో ఓట‌మి వైసీపీకి అంత లైట్‌గా తీసుకునే విష‌యం కాదు. కానీ, లోలోన బాధ ఉన్నా త‌న విశాల భవిష్య‌త్తు కోసం జ‌గ‌న్ ఈ బాధ‌ను పంటిబిగువున బిగించి.. నూత‌న ధైర్యంతో ముందుకు రావ‌డం విమ‌ర్శ‌కుల నోళ్ల‌కు తాళం వేయించింది. క‌నీసం వారం కూడా కాని ఈ ప‌రాభ‌వం నుంచి జ‌గ‌న్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడా ? అని ఆలోచించేలా చేసింది. మొత్తానికి జ‌గ‌న్‌ను ఆ పార్టీ నేత‌లు టైగ‌ర్ అన్న‌ట్టుగానే ఆయ‌న ఇప్పుడు అదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కిందిస్థాయి కేడ‌ర్ మురిసిపోతోంది. మ‌రి భ‌విష్య‌త్తు వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.