కేసీఆర్‌, క‌విత‌ మాయ‌లో.. ప‌ద‌వులు పోగొట్టుకున్న మంత్రులు 

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఆయ‌న త‌న‌య నిజామాబాద్ ఎంపీ కల్వ‌కుంట్ల క‌విత‌ల‌పై ఓ ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌కు చెందిన అనుచ‌రులు తెగ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ తండ్రీ కూతుళ్ల కారణంగా మంత్రులు ప‌ద‌వులు పోగొట్టుకున్నార‌ని ఆరోపిస్తున్నారు. వీరి ధ‌న దాహానికి, వ్యూహ ప్ర‌తివ్యూహాల‌కు ఆ మంత్రులు బ‌ల‌య్యార‌ని అంటున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ‌లో రాజ‌కీయం స‌ర‌వ‌త్త‌రంగా మారింది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఆ విష‌యం ఏంటో మ‌నంకూడా ప‌రికిద్దాం ప‌దండి!

తెలంగాణ‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, గ‌తంలో రైల్వే శాఖ స‌హాయ మంత్రిగా కూడా ప‌నిచేసిన బండారు ద‌త్తాత్రేయ తాజాగా కేంద్ర మంత్రి ప‌ద‌విని పోగొట్టుకున్నారు. ఇలా జ‌రుగుతుంద‌ని ఆయ‌న క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. అదేవిధంగా మ‌రో కేంద్ర మంత్రి ప్ర‌తాప్ సింగ్ రూఢీ కూడా కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వీరిద్ద‌రూ బీజేపీకి అత్యంత విధేయులు, సీనియ‌ర్లు అయిన‌ప్ప‌టికీ.. ఎందుకిలా అర్ధాంత‌రంగా ప్ర‌ధాని మోడీ వీరితో రాజీనామా చేయించారు? అని చ‌ర్చించుకుంటున్నారు పొలిటిక‌ల్ నేత‌లు. ఈ సంద‌ర్బంగా వారికి రెండు విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

ఒక‌టి.. ద‌త్త‌న్న‌.. కేసీఆర్ మాట‌ల మాయ‌లో ప‌డ్డార‌ని, ప్ర‌తాప్ సింగ్ రూఢీ కేసీఆర్ త‌న‌య క‌విత మాట‌ల‌తో ఐస్ అయిపోయార‌ని ఈక్ర‌మంలోనే వారు త‌మ ప‌దవుల‌ను పోగొట్టుకున్నార‌ని అంటున్నారు. నిజానికి కేసీఆర్ అంటే బీజేపీకి ఎంత మాత్ర‌మూ ప‌డ‌దు. తెలంగాణ విమోచ‌న దినాన్ని నిర్వ‌హించాల‌ని 2014 నుంచి కేసీఆర్‌ను కేంద్రంలోని బీజేపీ నేత‌లు కోరుతున్నారు. అయినా కూడా కేసీఆర్ చేయ‌డం లేదు. కేంద్ర ప‌థ‌కాలు స‌రిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డం లేదు. ఇదే విష‌యాన్ని బీజేపీ అధ్య‌క్షుడు షా సైతం తెలంగాణ వ‌చ్చిన‌ప్ప‌డు విమ‌ర్శించారు.

ఈ క్ర‌మంలో కేసీఆర్‌తో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సిన బీజేపీ కేంద్ర మంత్రి దత్త‌న్న రాసుకు పూసుకు తిరిగాడు. దీంతో మోడీకి మండి ప‌ద‌వి నుంచి ప‌క్క‌న కూర్చోబెట్టారు. ఇక‌, క‌విత స్థాపించిన జాగృతి సంస్థ‌కు మేకిన్ ఇండియా, అంకు ర సంస్థ‌ల కింద కేంద్రం నుంచి నిధులు భారీ గా చేకూర్చి పెట్టారు ప్ర‌తాప్ సింగ్ రూడీ. కానీ, ఆమె ఫ‌లితాలు చూపించ‌లేదు. పైగా కేంద్రానికి క్రెడిట్ కూడా రాలేదు. దీంతో ప్ర‌తాప్‌పైనా మోడీ కారాలు మిరియాలు నూరారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌నను కూడా సీటు దింపేశార‌ని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్‌, క‌విత‌లతో ప‌రిచ‌యం ఎంత ప‌నిచేసింద‌ని అంటున్నారు మాజీ మంత్రుల అనుచ‌రులు.