బాబుపై తెలుగు త‌మ్మ‌ళ్ల గ‌రంగ‌రం

అధికార టీడీపీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. త‌మ్ముళ్ల‌కు కంటిపై కునుకు కూడా ఉండ‌డం లేదు. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర పైగా స‌మ‌యం ఉండ‌గానే వాళ్ల‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము గెలుస్తామో లేదో.. ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఆద‌రిస్తారో లేదో.. అనే ఆందోళ‌న క‌న్నా అధినేత త‌మ‌ను అక్కున చేర్చుకుంటారా? లేదా? అనే దిగులే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌ను ఏదో ఒక రూపంలో హ‌డావుడికి గురి చేస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు.. తాజాగా మ‌రోసారి వాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్నారు. వాళ్ల‌కి నిద్ర‌ప‌ట్ట‌కుండా చేస్తున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో సైకిల్ జోరు హుషారుగా సాగింది. ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డ్డ విప‌క్ష వైసీపీ నేత జ‌గ‌న్‌ని ఘోరంగా దెబ్బ‌తీసి ఈ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేల‌తో చంద్ర‌బాబు రెండు రోజులు వ‌ర్క్ షాపు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బాబు చేసిన కామెంట్లే ఇప్పుడు త‌మ్ముళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. 2019 ఎన్నిక‌లు ముంద‌స్తే రావొచ్చ‌ని చెప్పుకొచ్చిన బాబు.. ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స‌లు ఉంటాయ‌ని, వాటిని అంద‌రూ ఆహ్వానించాల‌ని న‌వ్వుతూనే నిప్పంటించారు.

అదేస‌మ‌యంలో అవినీతికి పాల్ప‌డుతూ.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేని ఎమ్మెల్యేల‌కు క‌ర్ర‌కాల్చి వాత‌పెట్టేలా.. కొంతమంది కోసం అందరినీ వదులుకోలేనని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇక‌, వ‌చ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తామని ఖ‌రాఖండీగా ప్ర‌క‌టించేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల బంధువుల జోక్యం ఎక్కువయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఏడాది సమయంలో నాలుగుసార్లు సర్వే చేయించాలని నిర్ణయించారు. నాలుగు సర్వేల్లో ఫలితాలను బట్టే టిక్కెట్ కేటాయింపు ఉంటుందని చంద్రబాబు చెప్పడంతో ఎమ్మెల్యేల్లో ఆందోళన ప్రారంభమైంది.

కాగా, అధినేత వెర్ష‌న్‌కి త‌మ్ముళ్లులోలోనే కుమిలిపోతూ.. లోలోనే ఆయ‌న‌పై నిప్పులు చెరుగుతున్నారు. నియోజక వ‌ర్గాల అభివృద్ధికి నిధులు అదిగితే,.. లోటు బ‌డ్జెట్ అంటున్నారు. మ‌రి నియోజ‌క‌వర్గాల అభివృద్ధి ఎలా సాధ్య‌మో త‌మ‌రే విన్న‌వించాల‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. తాము కూడా ప్ర‌జాసేవ చేసేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చామ‌ని, త‌మ‌కూ బాధ్య‌త‌లు తెలుసున‌ని త‌మ స‌హ‌చ‌రుల వ‌ద్ద వాపోతున్నారు. రానురాను బాబుకు చాద‌స్తం ఎక్కువై పోతోంద‌ని, తాను , త‌న ప‌రివారం త‌ప్ప ఎవ‌రూ ప‌నిచేయ‌డం లేద‌నే ధోర‌ణిని పెంచుకుంటున్నార‌నే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.