కేసీఆర్ ఫ్యామిలీ మ‌రో వార‌సుడు… ఆ నియోజ‌క‌వ‌ర్గం క‌న్‌ఫార్మ్‌

టీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబ పెత్త‌నం ఎక్కువైంద‌న్న విమ‌ర్శ‌లు విప‌క్షాల నుంచి పెద్ద ఎత్తునే ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉంటే ఆయ‌న కుమార్తె క‌విత నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఇక ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ మంత్రిగా ఉంటే, మేన‌ళ్లుడు హ‌రీష్‌రావు సైతం మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ స‌మీప బంధువు బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ క‌రీంన‌గ‌ర్ ఎంపీగా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్ర‌భుత్వంలో వీళ్ల‌దే పెత్త‌నం.

ఇక వీళ్ల‌కు తోడు ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మ‌రో వార‌సుడు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధ‌మైంది. ఆయ‌న పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం కూడా ఖరారు అయిపోయింద‌ని స‌మాచారం! ఆయ‌న పేరు జోగిన‌ప‌ల్లి సంతోష్ రావు. ఇప్ప‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ రాజ‌కీయాల్లో తెర‌వెన‌కే ఉండిపోయిన సంతోష్‌రావు ఇప్పుడు తెర‌ముందు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు కేసీఆర్ స్కెచ్ గీసేశారు.

ఇంత‌కు సంతోష్‌రావు ఎవ‌రో కాదు కేసీఆర్ మరదలి కొడుకు. ఇక‌ సంతోష్ ఎంట్రీకి నియోజ‌క‌వ‌ర్గం కూడా ఖ‌రారు అయింద‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ వ్య‌వ‌హారాల‌ను కొంత వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తోన్న సంతోష్‌రావు 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నార‌ట‌. ద్వంద్వ పౌర‌స‌త్వం క‌లిగి ఉన్నాడ‌న్న కార‌ణంతో కరీంనగర్‌ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్యాన్ని రద్దు చేస్తూ కేంద్ర హౌంశాఖ నిర్ణయం తీసుకుంది.

వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ర‌మేష్ ఆరు నెల‌లు జ‌ర్మ‌నీలో మ‌రో ఆరు నెల‌లు ఇక్క‌డ ఉంటున్నారు. దీనికి తోడు ఆయ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య కూడా తోడైంది. ఇక ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్ జ‌నాల్లోకి దూసుకుపోతున్నారు. ర‌మేష్ నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌డంతో ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను తప్పించి, ఆ సీటును సంతోష్‌రావుకు ఇవ్వాల‌ని కేసీఆర్ దాదాపు డెసిష‌న్ తీసుకున్న‌ట్టే తెలుస్తోంది. ఏదేమైనా కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మ‌రో వార‌సుడు పొలిటిక‌ల్ ఎంట్రీ దాదాపు ఖాయ‌మైపోయింది.