నంద్యాల ఉప ఎన్నిక అత‌డి ప్రాణం తీసింది

ఏపీలో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ మ‌ధ్య ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ వ్య‌క్తి ప్రాణం తీసింది. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుస్తుందా ? వైసీపీ గెలుస్తుందా ? అన్న‌దానిపై మాటా మాటా పెరిగి ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ కాశారు. కానీ ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన గంటా సూర్యనారాయణ (55) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. నంద్యాల ఉప ఎన్నిక సంద‌ర్భంగా అదే గ్రామానికి చెందిన వైసీపీ అభిమాని గోలి శ్రీనివాస్‌తో టీడీపీ అభిమాని శివ పందెం కాశాడు. నంద్యాల‌లో టీడీపీకి 16వేలకు మించి మెజారిటీ రాదని వైసీపీ కార్యకర్త శ్రీను ఐదు వేలు పందెం కాశాడు. ఈ పందేనికి సూర్య‌నారాయ‌ణ మ‌ధ్య‌వ‌ర్తిగా ఉన్నారు. నంద్యాలలో టీడీపీకి 25వేలకు పైగా మెజారిటీ రావడంతో వైసీపీ అభిమాని శ్రీను టీడీపీ అభిమాని శివకు ఐదు వేలు ఇవ్వాల్సి ఉంది.

ఫలితం వచ్చి ఇన్ని రోజులవుతున్నా శ్రీను పందెం డబ్బులు చెల్లించలేదు. దీంతో శివ మధ్యవర్తిగా ఉన్న సూర్యనారాయణపై ఒత్తిడి తెచ్చారు. అయితే తమపై వత్తిడి తెస్తున్నారని వైసీపీ కార్యకర్త శ్రీను మరికొందరు మధ్యవర్తిగా ఉన్న సూర్యనారాయణ అతని కుమారుడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సూర్యనారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పోలీసులు శ్రీనుతో పాటు మ‌రో ఐదుగురిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.