హ‌రిబాబుకు అందుకే మంత్రి ప‌ద‌వి రాలేదా..?

కంభంపాటి హ‌రిబాబు! వృత్తి రీత్యా సీనియ‌ర్ ప్రొఫెస‌ర్‌. అయితే, జై ఆంధ్ర ఉద్య‌మ నేప‌థ్యంలో ఆయ‌న ఉద్య‌మాల్లోకి మారారు. అటునుంచి వెంక‌య్య‌తో ఏర్ప‌డిన బంధం.. రాజ‌కీయంగా మారి.. తొలుత ఆర్ ఎస్ ఎస్ ప్ర‌చార‌క్‌గా త‌ర్వాత బీజేపీ నేత‌గా ఎదిగారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా కూడా హ‌రి బాబు ప‌ని చేశారు. ఈ క్ర‌మంలోనే వెంక‌య్య‌తో ఉన్న బంధంతో విశాఖ నుంచి 2014లో ఎంపీగా గెలిచారు. అయితే, ఆ త‌ర్వాత ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని భావించిన అధిష్టానం వైఖ‌రికి భిన్నంగా ఆయ‌న పార్టీని ప‌ట్టించుకోవ‌డం మానేసి ఢిల్లీలోని వెంక‌య్య నివాసంలోనే కాలం గ‌డిపేశాడు.

అడ‌పాద‌డ‌పా ఏపీకి రావ‌డం, త‌న సొంత ప‌నులు లేదే నియోజ‌క‌వ‌ర్గంలో ఏదైనా కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం వెళ్ల‌డం. అంతేత‌ప్ప డెడికేటెడ్‌గా చేసింది శూన్యం. మ‌రోప‌క్క‌, వెంక‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉంటూ.. వ‌చ్చారు. దీంతో అధికార టీడీపీతో అంట‌కాగ‌డం ఎక్కువైంది. ఈ ప‌రిణామం స్థానికి బీజేపీ నేత‌ల‌కు రుచించ‌లేదు. త‌మ నేతే టీడీపీ నేత‌ల‌తో క‌లిసిపోయి.. త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంపై సోము వీర్రాజు వంటి నేత‌లు బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. అయినా స‌రే వెంక‌య్య ఉండడంతో కంభంపాటి ప్ర‌తి విమ‌ర్శ‌లు ఏనాడూ చేయ‌లేదు.

ఇక‌, వెంక‌య్య ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్ల‌డంతో కంభం పాటికి కేంద్రంలో మెరుగైన ప‌ద‌వి ల‌భిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆదివారం నాటి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కూ చోటు ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, అనూహ్యంగా చివ‌రి నిముషంలో ఆయ‌న పేరును జాబితా నుంచి తొల‌గించిన ట్టు తెలిసింది.

దీనివెనుక సొంత పార్టీ నేత‌లే ఉన్నార‌ని, తాను టీడీపీకి అనుకూలంగా స్థానికంగా చ‌క్రం తిప్పుతున్నార‌ని, ఆయ‌న వ‌ల్ల ఏపీలో బీజేపీకి ఒరిగింది లేద‌ని కేంద్రానికి ఫిర్యాదులు వెల్ల‌వెత్తాయి. దీంతో కంభంపాటిని ప‌క్క‌కు పెట్టిన‌ట్టు తెస్తోంది. అయితే, త్వ‌ర‌లోనే మ‌ళ్లీ కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని, అప్పుడు కంభంపాటికి త‌ప్ప‌కుండా సీటు ద‌క్కుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏంజ రుగుతుందో చూడాలి.