క‌ళ్యాణ్‌రామ్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య 103 ..!

త‌న కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ ఆ సినిమా ఇచ్చిన జోష్‌తోనే ఏమోగాని జోరు పెంచేశాడు. కుర్ర‌హీరోలా వ‌రుస‌గా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. పైసా వ‌సూల్‌గా తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బాల‌య్య ఇప్పుడు తన 102వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే బాల‌య్య అప్పుడే త‌న‌ నెక్ట్స్ సినిమా కూడా ఫైనల్ చేశాడన్నా టాక్ వినిపిస్తోంది. నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్‌కు ప‌టాస్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమా ఇచ్చిన అనిల్ రావిపూడి బాల‌య్య 103 సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలుస్తోంది. ప‌టాస్ త‌ర్వాత అనిల్ రావిపూడి సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీం సినిమాతో హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్య కోసం కథ రెడీ చేశాడ‌ట‌. వీరి కాంబోలో గ‌తంలోనే సినిమా వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. రామారావు గారు అనే టైటిల్ కూడా అనిల్ ఫిక్స్ చేశాడ‌ట‌.

చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై చర్చలు జరుగుతుండగా.. ఇటీవల బాలకృష్ణ ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను గుంటూరు జిల్లాలో టాప్ సినిమాలు పంపిణీ చేసే ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ అయిన వాస‌వీ ఫిలింస్ నిర్మించ‌నుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.