ఏపీలో సైకిల్ జోరుగా హుషారుగా దూసుకుపోతోంది. ప్రతిష్టాత్మకంగాను, హోరాహోరీగాను జరుగుతాయని టీడీపీ వాళ్లు అంచనాలు వేసుకున్న ఎన్నికల్లో సైతం వైసీపీ బొక్కబోర్లాపడిపోతోంది. సైకిల్ స్పీడ్‌కు ఫ్యాన్ రెక్కలు తెగికింద పడిపోతున్నాయి. నంద్యాల, కాకినాడ, కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలకే అందని విధంగా టీడీపీ గెలుస్తుండడంతో ఆయన కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హీరో ఎవరంటే నిస్సందేహంగా చంద్రబాబే అని చెప్పాలి.
నంద్యాలలాంటి చోట్ల జగన్ ఏకంగా 15 రోజులు మకాం వేసి ప్రచారం చేసినా చంద్రబాబుకు కనీస పోటీ కూడా ఇవ్వలేదు. వరుస ఓటములతో కుంగిపోతోన్న జగన్ చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇదంతా ఓకే చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో పాలన ఇరగదీసేసి ఆయన టాప్ పొజిషన్‌లో ఉన్నాడా ? అని ప్రశ్నించుకుంటే కాదు కానే కాదు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో హామీలను చంద్రబాబు ఇప్పటకీ అమలు చేయలేదు. ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
పోలవరం ప్రాజెక్టు అతీగతీలేదు. రుణమాఫీ జరగలేదు. డ్వాక్రా రుణాల సంగతి అంతే.. హెచ్చుమీరిన అవినీతి, సొంత పార్టీలో గ్రూపుల గోలకు లెక్కేలేదు. ఇంత జరుగుతున్నా జనాలు మాత్రం చంద్రబాబునే గెలిపిస్తున్నారు. బాబుకు ప్లస్సులు ఎక్కువ ఉండి మాత్రం టీడీపీ గెలవడం లేదు…ఆయన హీరో అవ్వడం లేదు…వైసీపీకి లెక్కకు మిక్కిలిగా ఉన్న తప్పులు, జగన్ వల్లే చంద్రబాబు హీరో అవుతున్నారు.
జగన్‌కు తనకు ముందుగా సెల్ఫ్ కంట్రోల్ లేదు. చంద్రబాబుపై ఇంట్లో, నాలుగు గోడల మధ్య ఏం మాట్లాడుకున్నా, ఎంత తిట్టినా జనాల్లోకి వచ్చాక కొంత స్వీయ నియంత్రణ ఉండాలి. అది జగన్‌లో లేదు. ఇక రోజా లాంటి వాళ్లు ఆయనకు పెద్ద మైనస్. నెల్లూరులో క్రికెట్ బెట్టింగుల్లో వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు బయటకు వచ్చాయి.
ఇదిలా ఉంటే కాకినాడ ఎన్నికల తర్వాత విజయసాయిరెడ్డితోను ఆయన వైరం వచ్చినట్టు వైసీపీ వర్గాలే చెపుతున్నాయి. ఇక ప్రకాశంలో మామ బాలినేనికి, బాబాయ్ సుబ్బారెడ్డికి పడడం లేదు. బెజవాడలో బంధువు గౌతంరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి, జగన్‌కు కాపుల్లో పెద్ద బ్యాడ్ నేమ్ వచ్చింది. త్వరలో ఎన్నికలు జరిగే ఉత్తరాంధ్రలోని విశాఖలో వైసీపీకి నాయకులు ఉన్నారా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
రాయలసీమలో రోజు రోజుకు పెరుగుతోన్న అసంతృప్త జ్వాలలు, దీనికి తోడు ఎప్పుడు ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ పార్టీ మారతారో ? కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు వైసీపీ నేతలు టీడీపీతో పోటీ పడడం లేదు….వాళ్లలో వాళ్లే పోటీ పడుతున్నారు. దీంతో ఇంచక్కా టీడీపీ వాళ్లు గెలిచేందుకు పెద్దగా కష్టపడాల్సిన ఏముంది. దీంతో చంద్రబాబుపై ఎంత వ్యతిరేకత ఉన్నా, ఆయన పెద్దగా కష్టపడకుండానే హీరో అవుతున్నారని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. మరి జగన్ ముందు టీడీపీపై పోరాటం కన్నా సొంత పార్టీ నేతలను ఓ దారిలోకి తెచ్చేందుకే పెద్ద పోరాటం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.