టీఆర్ ఎస్‌లో షాక్‌: ఈ 25 మంది సిట్టింగులు ఇంటికే!

అవున‌ట‌! తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ డెసిష‌న్ తీసుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. నిజానికి కేసీఆర్ ఒక డెసిష‌న్ తీసుకుంటే.. `అంతే!` అనే మాట ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఆయ‌న సిట్టింగ్ ఎమ్మెల్యేల విష‌యంలో ఓ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం.  2019 ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే రానున్నాయి. దీనికిగాను ఇప్ప‌టి నుంచే హ‌డావుడి మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే, సీఎం కేసీఆర్‌.. సిట్టింగుల‌కు సీట్లు ఇవ్వాలా?  లేక కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా? అని కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మంది అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. 

వీరికి ఇప్ప‌టికే కేసీఆర్ ప‌లుమార్లు హెచ్చ‌రిక‌లు పంపారు. అయినా కూడా వారిలో మార్పు వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ విష‌యంలో ఇప్పటికే మూడుసార్లు సర్వే చేయించిన కేసీఆర్ నాలుగోసారి సర్వేకు సిద్ధమవుతున్నారు. అయితే గత మూడు సర్వేల్లోనూ అట్టడుగున దాదాపు 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో  వీరికి టికెట్లు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే మంచిద‌నే ఆలోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్నార‌ని స‌మాచారం. అయితే, వీరిలో కొందరి నియోజకవర్గాలను మార్చాలని, మరికొందరి స్థానంలో ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకురావాలన్నది కూడా కేసీఆర్ వ్యూహంగా కన్పిస్తోంది.  

ఎక్క‌డిక‌క్క‌డ ఎమ్మెల్యేలు త‌మ త‌మ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని తాను సూచించినా కొందరు సిట్టింగ్ లు పట్టించుకోవడం లేదని కేసీఆర్‌కు స‌మాచారం అందింది. కేవలం అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప పెద్దగా ప్రజల్లోకి  వెళ్లలేకపోతున్నార‌ని ఈ  25 మంది ఎమ్మెల్యేలపై రిపోర్టు కూడా అందిన‌ట్టు స‌మాచారం. దీంతో వీరిపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక భావ‌న ఉంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరు గెలిచే ప‌రిస్థితి కూడా లేద‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. దీంతో ఆయ‌న   గెలుపు గుర్రాలకే టిక్కెట్లివ్వాలని డిసైడ్ అయ్యార‌ట‌.

అలాగ‌ని వీరికి టికెట్ ఇవ్వ‌క‌పోయినా..  వీరి సేవలను మాత్రం పార్టీలో గానీ, ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ వినియోగించుకోవాల‌ని భావిస్తున్నారు. అంటే ఎవ‌రినీ హ‌ర్ట్ చేయ‌కుండా చూడాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో కొత్త అభ్యర్థుల బలాబలాలపై స‌ర్వే చేయిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, టికెట్లు ద‌క్క‌నివారి జాబితా ఇలా ఉంది..

+ నల్లగొండకు చెందిన ఓ మంత్రి అనుచరులుగా చెప్పుకునే ఇద్దరికి 

+  తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్

+ తాండూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మహేందర్ రెడ్డికి మార్పు.

+ వికారాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ కష్టమే. 

+ ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోనూ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్  టెన్ష‌నే!! మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.