క‌ల‌క‌లం: బీజేపీలోకి ఆరుగురు టీఆర్ఎస్‌ ఎంపీలు జంప్‌

ప్ర‌త్య‌ర్థుల‌కు అంతుచిక్క‌ని వ్యూహాల‌తో దూసుకుపోతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. సొంత పార్టీ ఎంపీలే షాక్ ఇవ్వ‌బోతున్నారా? మూకుమ్మ‌డిగా రాజీనామా చేసి.. ఇక బీజేపీ గూటికి చేరిపోయేందుకు ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇటీవ‌ల కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్ చేరిపోతుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. ఇక కేసీఆర్ కూతురు, ఎంపీ క‌విత‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని కూడా హ‌ల్‌చల్ చేశాయి. కానీ త‌ర్వాత అవ‌న్నీ ఊహాగానాలే అని తేలిపోయాయి. అయితే టీఆర్ఎస్‌ ఎంపీల్లో కొందరిని ఇప్పుడు అభ ద్ర‌తా భావం ఆవ‌రించింద‌ట‌. ఎంపీల‌మ‌యినా పార్టీలో త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని ఆవేన చెందుతున్నార‌ట‌.

టీఆర్ఎస్‌లో అంతా కేసీఆర్ ఫ్యామిలీ అండ్ కోదే హ‌వా! ఎవ‌రిమీద‌యినా రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయాల‌న్నా.. ఏదైనా స‌భ జ‌రిగినా.. అంతా మంత్రుల‌దే! ఇక ఎంపీలు ఉన్నా వారికి ఎప్పుడో గాని మాట్లాడే అవ‌కాశం రాదు! ఇదే ఇప్పుడు వీరిలో అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంది. కొంత‌మంది ఎంపీలు తీవ్రంగా నైరాశ్యంలో ప‌డిపోయార‌ట‌. వ‌చ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ త‌ర‌ఫున‌ గెలిచినా త‌మ‌కు కలిగే ప్రయోజనం శూన్యమని కొంద‌రు ఎంపీలు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా తాము అధికార పీఠాలకు దూరంగా ఎక్కడో వుండిపోవాల్సి వస్తోంద‌ని తీవ్రంగా మ‌థ‌న‌ప‌డుతున్నార‌ట‌. ఎమ్మెల్య‌లు, మంత్రులు దూసుకుపోతుంటే వారి త‌ర్వాత ఎక్క‌డో ఉన్నామ‌ని వాపోతున్నార‌ట‌.

కేసీఆర్ కుటుంబ సభ్యులు కొందరు చక్రం తిప్పుతుంటే తర్వాత మంత్రులు ఉంటే ఆ తర్వాతి స్థానంతో సర్దుకోవలసి వస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. ఆర్థికంగా లాభదాయక మైన అంశాలు తమ వ‌ర‌కూ వ‌చ్చే ప్రసక్తి లేకుండా పోయిందని వాపోతున్నారు. టీఆర్‌ఎస్‌ నెమ్మదిగా కేంద్రంలో చేరుతుందనే ఆశతో ఇంతకాలం నిరీక్షించినా ప్రధాని మోడీ ఆ అవకాశం ఇవ్వబోరని వీరు నిర్ధారణకు వచ్చార‌ట‌. పైగా అక్కడ కూడా కవిత పేరే ముందు వినిపిస్తోందని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాము గెలిచినా.. ఎటువంటి ప‌ద‌వులు, ఎటువంటి ప్రాధాన్యం లేకుండానే ఉండిపోవాల్సి వ‌స్తుంద‌ని వీరంతా విశ్వ‌సిస్తున్నార‌ట‌.

మ‌రోపక్క తెలంగాణ‌లో బ‌ల‌పడేందుకు బీజేపీ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అసంతృప్త ఎంపీలతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఎంపీ టికెట్ ద‌క్క‌డం క‌ష్ట‌మ‌ని భావించిన నేత‌లంతా ఇప్పుడు బీజేపీలో చేరిపోయే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. బీజేపీలో చేరిపోతే పార్టీ కొద్దిగా బ‌ల‌ప‌డటంతో పాటు త‌మ‌కూ త‌గిన ప్రాధాన్యం దక్కుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నార‌ట‌. వీరంతా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా `సిగ్న‌ల్‌` కోసం వెయిట్ చేస్తున్నార‌ని, అప్ప‌టివ‌ర‌కూ బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నార‌ట‌. ఇక స‌రైన స‌మ‌యం వ‌స్తే క‌మ‌లం పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం!! మ‌రి వీరి ఆశ‌లు చివ‌రికి ఏమ‌వుతాయో!!