ఉలిక్కిపడ్డ పార్టీ … టెన్షన్ లో నాయకులు

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో పాతాళానికి ప‌డిపోయిన కాంగ్రెస్‌.. ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతోంది. పార్టీకి వీర విధేయులైన నాయ‌కులు.. అంతోఇంతో క్యాడ‌ర్ త‌ప్ప ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఉన్న వారితోనే నెట్టుకొస్తున్న కాంగ్రెస్‌.. నంద్యాల ఉప ఎన్నిక‌ల బ‌రిలో దిగుతామ‌ని ప్ర‌కటించినా అంత‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ప్ర‌క‌ట‌న అయితే చేసేసింది కానీ ఇప్పుడు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. ఎంతో క‌ష్ట‌ప‌డి.. భూత‌ద్ధంలో వెతికి.. నేను పోటీచేయ‌ను అన్నా బుజ్జ‌గించి మరీ ఒక అభ్య‌ర్థిని బ‌రిలో నిల‌బెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ నేత‌ల్లో మ‌రో టెన్ష‌న్ మొద‌లైంది. ఆయ‌న కూడా ఏదో ఒక పార్టీలోకి జంప్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని అనుమానించి మ‌రో అభ్య‌ర్థి చేత నామినేష‌న్ దాఖ‌లు చేయించింది.

అభ్య‌ర్థుల కోసం పోటీప‌డిన కాంగ్రెస్ పార్టీకి అభ్య‌ర్థులే క‌రువ‌య్యారు. మేమంటే మేము పోటీచేస్తామ‌నన్న నేత‌లు.. ఇప్పుడు అమ్మో మేము పోటీ చేయ‌లేం అంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పార్టీ క‌ష్టాల గురించి ఇంత‌క‌న్నా ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన నాటి నుంచీ ఉనికి చాటుకోవ‌డం కోస‌మే అవ‌స్థ‌లు ప‌డాల్సిన ప‌రిస్థితి. మూలిగే న‌క్క మీద తాటి పండు ప‌డ్డ‌ట్టుగా… ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక ఆ పార్టీకి ఇంకో త‌ల‌నొప్పిగా మారింది. నంద్యాల ఎన్నికలో టీడీపీ, వైకాపాల మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉంటుంద‌న్న‌ది సుస్ప‌ష్టం. అయినా స‌రే, త‌మ‌కూ లాభించే అంశాలు కొన్ని ఉన్నాయ‌న్న ధీమాతో కాంగ్రెస్ కూడా ఈ ఉప ఎన్నిక బ‌రిలోకి దిగింది.

అస‌లు స‌మ‌స్య ఇక్కడే మొద‌లైంది. ఒక‌ప్పుడు, కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తుందంటే ఎగ‌బ‌డి పోటీ ప‌డే స్థాయిలో నేత‌లు ఉండేవారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా భిన్నం. బ‌తిమాలి మ‌రీ అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసుకోవాల్సి వ‌స్తోంది. ఎలాగోలా ఒక నాయ‌కుడిని ఎంపిక చేసి, టిక్కెట్ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించినా.. ఎందుకో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా అబ్దుల్ ఖాద‌ర్ ను అభ్య‌ర్థిగా ఎంపిక చేశారు. నియోజ‌క వ‌ర్గంలో మైనారిటీల‌తో పాటు ఇత‌ర వ‌ర్గాల్లో ఆయ‌న‌కు మంచి పేరు ఉంద‌నేది కాంగ్రెస్ అభిప్రాయం. అయితే, అభ్య‌ర్థిని ఎంపిక చేసినా ఎందుకో ఆ పార్టీకి ఇంకా ధైర్యం చాల‌డం లేద‌ట‌! ఆయ‌న చివ‌రి వ‌ర‌కూ ఉంటారా.. మ‌ధ్య‌లోనే ఏదో ఒక పార్టీలోకి గోడ దూకేస్తారా అనే టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌.

టీడీపీ లేదా వైకాపా నుంచి ఏదో ఒక ప్ర‌లోభం వ‌చ్చి ఉన్న‌ట్టుండి ప్లేటు ఫిరాయించేస్తే పార్టీ ప‌రువు పోతుంద‌ని తెగ ఫీల‌వుతున్నార‌ట‌. అందుకే, ముంద‌స్తుగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నార‌ట‌. ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు గానీ, కాంగ్రెస్ మాత్రం చివ‌రి వ‌ర‌కూ బ‌రిలో నిలిచి ఉండేలా చూడ‌టం కోసం.. షాడో అభ్య‌ర్థుల్ని రంగంలోకి దించింద‌ట‌. ఖాద‌ర్ తోపాటు మ‌రో ఇద్ద‌ర్ని కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థులుగా రంగంలోకి దించుతున్న‌ట్టు స‌మాచారం. వీరిలో కొంద‌రు టీడీపీ, వైసీపీల‌కు కోవ‌ర్టులుగా ప‌ని చేస్తున్న‌ట్టు చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ, వైకాపా విజయం కోసం పోరాడుతూ ఉంటే, కాంగ్రెస్ మాత్రం అభ్య‌ర్థిని నిలుపుకోవ‌డ‌మే కష్టంగా మారుతోంది! ఇప్పుడే ఇలా ఉంటే మ‌రి మున్ముందు ఇంకెలా ఉంటుందో!!