ఏపీలో మ‌రో ఉప ఎన్నిక‌!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లా రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. అసలు ఏ క్షణానికి అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఏం జరుగుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఈ రోజు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరుతున్న సంగ‌తి తెలిసిందే. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన శిల్పా చక్రపాణి రెడ్డికి వైసీపీ అధినేత జ‌గ‌న్ షాక్ ఇచ్చారు.

టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో చేరాలంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ మెలిక పెట్టారు. అలాగే చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో ఏం చేయాలా ? అని చ‌క్ర‌పాణిరెడ్డి డైల‌మాలో ప‌డ్డారు.

బుడ్డా స‌వాల్‌:

శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డికి శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ్‌రెడ్డి చ‌క్ర‌పాణికి ధీటుగా తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైసీపీని వీడి టీడీపీలో చేరానని ఆయన మీడియాతో చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ మారుతున్నాడంటూ ఎమ్మెల్యే బుడ్డా ఆరోపించారు.

మ‌రి అటు చ‌క్ర‌పాణిరెడ్డి ఎమ్మెల్సీగా, ఇటు బుడ్డా ఎమ్మెల్యే రాజీనామాలు ఆమోదం పొందితే క‌ర్నూలు జిల్లాలోనే మ‌రో రెండు స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. అప్పుడు వీరిద్ద‌రు శ్రీశైలంలో ఎమ్మెల్యేలుగా పోటీప‌డ‌క త‌ప్ప‌దు. అదే జ‌రిగితే ఏపీలో మ‌రో ఉప ఎన్నిక రావ‌డం ఖాయం. ఏదేమైనా ఉప ఎన్నిక వేళ జిల్లా అంతా పొలిటిక‌ల్ హీట్ 100 డిగ్రీల‌కు ఎక్కువ‌గానే ఉంది.