రోజాకు జ‌గ‌న్ షాక్‌… హేమ‌కు కీల‌క ప‌గ్గాలు..?

ఏపీలో విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యే రోజా పేరు చెపితే తెలుగు ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. రోజా తెలుగు రాజ‌కీయాల్లో గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంగా కొన‌సాగుతున్నారు. టీడీపీతో ప్రారంభమైన రోజా రాజ‌కీయ ప్ర‌స్థానం ఆ పార్టీలో ఎన్నో ఒడిదుడుకుల‌తో సాగింది. 2004లో న‌గ‌రి నుంచి, 2009లో చంద్ర‌గిరి నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన రోజా ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేసిన ఆమె న‌గ‌రి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడిని ఓడించి పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేశారు.

ఇక ఈ మూడేళ్ల‌లో వైసీపీలో రోజా మామూలుగా హంగామా చేయ‌లేదు. అసెంబ్లీలోను బ‌య‌టా అధికార టీడీపీని, చంద్ర‌బాబును ఓ రేంజ్‌లో ఏకిప‌డేశారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. రోజా అక్క‌డితే ఆగ‌లేదు. అసెంబ్లీలో తోటి మ‌హిళా స‌భ్యుల‌తో అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించిన ఆమె సీఎం చంద్ర‌బాబును ఏకంగా కామ సీఎం చంద్ర‌బాబు…కాల్ మ‌నీ సీఎం చంద్ర‌బాబు అంటూ తీవ్ర ప‌ద‌జాలంతో విమ‌ర్శించారు. ఈ ఇష్యూలో ఆమెను అసెంబ్లీ నుంచి ఏకంగా యేడాది పాటు స‌స్పెండ్ చేశారు. అయినా రోజా తీరు ఏ మాత్రం మార‌లేదు.

వైసీపీలో ఎంతోమంది సీనియ‌ర్లు ఉన్నా రోజా మాట్లాడితేనే ఎక్కువ క‌వరేజ్ వ‌స్తోంది. దీంతో ఆమెపై గుర్రుగా ఉన్న చాలా మంది సీనియ‌ర్లు జ‌గ‌న్‌కు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. చివ‌ర‌కు జ‌గ‌న్ రోజాకు నువ్వు మార‌క‌పోతే, నేనే నిన్ను మార్చేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించిన‌ట్టు కూడా టాక్‌. అయినా రోజా తీరు మార‌క‌పోవడంతో జ‌గ‌న్ ఇప్పుడు ఆమెకు చెక్ పెట్టేందుకు సినీ రంగానికే చెందిన మ‌రో లేడీని రంగంలోకి దించుతున్న‌ట్టు తెలుస్తోంది.

సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న హేమ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా కోన‌సీమ‌లోని రాజోలుకు చెందిన హేమ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు. ముద్రగడ పద్మనాభంతో కలిసి కాపు ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలనుకుంటున్నారు. కాపుల‌ను త‌మ వైపునకు తిప్పుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న జ‌గ‌న్ హేమ‌ను త‌న పార్టీలో చేర్చుకోవాల‌నుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

హేమ గ‌త ఎన్నిక‌ల్లో తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌పేట నుంచి జైస‌మైక్యాంధ్ర పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. మరి ఇప్పుడు హేమ వైసీపీలో చేరితే తెర‌వెన‌క పాత్ర‌కే ప‌రిమిత‌మ‌వుతుందా ? లేదా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కూడా పోటీ చేస్తుందా ? అన్న‌ది చూడాలి. ఇక వైసీపీలో చేరే హేమ‌కు జ‌గ‌న్ పార్టీలో కీల‌క‌ప‌గ్గాలు అప్ప‌గించి రోజా ప్రాధాన్య‌త క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గించేస్తార‌న్న టాక్ కూడా వైసీపీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది.