ఆ మంత్రిపై చంద్ర‌బాబు సీక్రెట్ నిఘా..!

ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబుకు ఇంటి పోరు త‌ప్ప‌డం లేదు. ముఖ్యంగా కేబినెట్‌లోని మంత్రి తీరుపై ఇప్పుడు ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ట‌. కీల‌క‌మైన నిర్ణ‌యాల‌ను త‌నకు స‌న్నిహితుడైన‌, మ‌రో పార్టీ అధినేత‌కు చెబుతుండ‌టంతో ఏం చేయాలో తెలియ‌ని సందిగ్థ స్థితిలో టీడీపీ అధినేత ఉన్నార‌ట‌. మంత్రి ప‌ద‌వి నుంచి తీసేస్తే.. ఆయ‌న సామాజిక‌వర్గం నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావించి వెన‌క‌డుగు వేస్తున్నార‌ట‌. పార్టీని ఇబ్బందుల కు గురిచేస్తున్న ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన రావెల కిషోర్ బాబును గుర్తు చేస్తోంద‌ని పార్టీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. బాబు కేబినెట్లో `స్పై` అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు గంటా శ్రీ‌నివాస‌రావు!

ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంటా శ్రీనివాస రావుపై తొలి నుంచి చంద్రబాబుకు అనుమానంగానే ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీతో ఈ అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో జరిగే విషయాలన్నింటినీ పూసగుచ్చినట్లుగా పవన్ కు గంటా శ్రీనివాసరావు చేరవేస్తున్నట్లు చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. సీఆర్డీఏ తీసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా తన వద్ద ప్రస్తావించడంతో ఆయ‌న‌కు మైండ్ బ్లాంక్ అయిందని సమాచారం. ఇదంతా గంటా శ్రీనివాసరావు పనేనని చంద్ర‌బాబుకు అర్థ‌మైంద‌ట‌.

త‌న కుమారుడిని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేయించాలని కూడా భావిస్తున్నట్లు తెలియడంతో గంటాపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కు, గంటాకు ప్రజారాజ్యం పార్టీ నుంచే మంచి సంబంధాలుండటంతో జాగ్రత్తగా డీల్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇక విశాఖలో భూ కుంభకోణం కేసులోనూ ప్రభుత్వాన్నిఇరుకున పెట్టేశారు గంటాశ్రీనివాసరావు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని లేఖ రాయడం వెనక కూడా ఏదో ఉందని చంద్రబాబు భావించారు. ఇక గంటాకు, మరో మంత్రి అయ్యన్నపాత్రుడికి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడానికి కూడా గంటానే కారణమని చంద్రబాబు బ‌లంగా నమ్ముతున్నారు.

ఇక‌ గంటా శ్రీనివాసరావు తరచూ పార్టీలు మారడం కూడా ఆయన్ను ఆలోచనలో పడేసింద‌ని చెబుతున్నారు. అయితే సామాజిక వర్గ సమీకరణలతోనే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించలేదంటున్నారు. గ‌తంలో రావెల కిశోర్ బాబు విష‌యంలోనూ సీఎం చంద్ర‌బాబుకు ఇదే విధ‌మైన ఇబ్బందులు వ‌చ్చాయి. అటు నియోజ‌క‌వ‌ర్గంలో, ఇటు పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగింది. ఆయ‌న పార్టీ మారిపోతార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగిపోయింది. ఇప్పుడు కూడా గంటా విష‌యంలోనూ చంద్ర‌బాబుకు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. మ‌రి ఆయ‌న ఏ నిర్ణ‌యంతీసుకుంటారో వేచిచూడాల్సిందే!