అన్నాచెల్లి వ‌ర్సెస్ అన్న‌ద‌మ్ములు… గెలుపు ఎవ‌రిది

తెలుగు ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి రేపుతోన్న నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అన్న‌చెల్లెళ్లు వర్సెస్ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జ‌రుగుతోన్న పోరులో ఎవ‌రు గెలుస్తారు అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. నంద్యాల ఉప ఎన్నిక‌ను బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్ వ‌ర్సెస్ రానా యుద్ధంతోను, కురుక్షేత్ర సంగ్రామంతోను పోలుస్తున్నారు. ఇక 2019 ఎన్నిక‌ల‌కు ఈ ఎన్నిక‌ను సెమీఫైన‌ల్స్‌గాను భావిస్తున్నారు.

నంద్యాల‌లో ఓట‌ర్ల‌ను వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ శ్రీకృష్ణుల‌తో పోల్చారు. ఇక్క‌డ జ‌రిగేది ధ‌ర్మ‌యుద్ధ‌మ‌ని చెప్పారు. ఇక ఇక్క‌డ టీడీపీ నుంచి భూమా బ్రహ్మానంద‌రెడ్డి పోటీ చేస్తుండ‌గా ఆయ‌న‌కు సోద‌రి, ఏపీ మంత్రి భూమా అఖిల‌ప్రియ అండ‌గా ఉంటున్నారు. ఇక వైసీపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పోటీ చేస్తుండ‌గా ఆయ‌న కోసం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఈ రోజు వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఇక ఇక్క‌డ ఎవ‌రి బలాబలాలు వారికి ఉన్నాయి. కులాల వారీగా లెక్క‌లు చూసుకుంటే నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2.09 ల‌క్ష‌ల ఓటర్లు ఉన్నారు. వీరిలో ముస్లిం, బీసీ ఓటర్లే కీల‌కంగా ఉన్నారు. ముస్లిం ఓటర్లు 56 వేలు ఉంటే, బీసీలు 45 వేలు ఉన్నారు. కాపులు 30 వేలు, వైశ్యులు 25 వేలు ఉన్నారు. బీసీల్లో బ‌ల‌మైన వాల్మీకి వ‌ర్గం ఓట‌ర్లు ఇక్క‌డ గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌నున్నారు.

ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్న భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికేత‌రుడు. రాజ‌కీయాల్లో కాస్తో కూస్తో అనుభ‌వం ఉన్నా పూర్తి స్థాయి అనుభ‌వం లేదు. బ్ర‌హ్మానంద‌రెడ్డికి సోద‌రి అఖిల‌తో పాటు ఏపీ కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియ‌మించిన టీం స‌హ‌క‌రిస్తోంది. ఇక భూమా దంప‌తులు చ‌నిపోవ‌డం కూడా టీడీపీకి సెంటిమెంట్ ప‌రంగా క‌లిసి రానుంది. ఇక పైనుంచి చంద్ర‌బాబు టోట‌ల్ ఎన్నిక‌ను లీడ్ చేస్తున్నారు.

ఇక వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డికి సోద‌రుడు చక్ర‌పాణి కూడా తోడు కావ‌డంతో ఇప్పుడు మ‌రింత ప్ల‌స్ అయ్యింది. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న చ‌క్ర‌పాణి ఇప్పుడు వైసీపీలోకి వ‌చ్చేయ‌డంతో వీరిద్ద‌రు ఒక‌రికి మ‌రొక‌రు తోడు అయ్యారు. ఈ సోద‌రుల‌కు వైసీపీ ఎమ్మెల్యేల‌తో పాటు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా తోడు కానున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇక్క‌డ ఏకంగా 14 రోజుల పాటు ఉంటాన‌ని చెప్ప‌డంతో వీరికి మంచి జోష్ ఇచ్చిన‌ట్ల‌య్యింది. వెన‌క ఎవ‌రు ఎంత‌మంది ఉన్నా అటు అన్నాచెల్లి, ఇటు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జ‌రుగుతోన్న నంద్యాల ఉప‌పోరులో ఎవ‌రు విన్ అవుతారో ? చూడాలి.