ఒక్క రాజీనామాతో ఆత్మ‌రక్ష‌ణ‌లో టీడీపీ

నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న‌రెడ్డి తమ్ముడు శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఇప్పుడు రాజకీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయ‌న‌.. వైసీపీలో చేరిన 24 గంట‌ల్లోనే స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు, ఇక్క‌డే వైసీపీ అధినేత జ‌గ‌న్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌కుండానే టీడీపీలో చేరిపోవ‌డం.. ఇంకా కొన‌సాగుతున్న త‌రుణంలో సీఎం చంద్ర‌బాబు చేసిన జ‌గ‌న్ చేయ‌లేద‌ని చెబుతున్నారు. ఫిరాయింపుదారుల‌తో రాజీనామాల విష‌యంలో చంద్ర‌బాబు ప్లాప్ అయ్యార‌ని.. జ‌గ‌న్ సూప‌ర్ హిట్ అయ్యార‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం!!

టీడీపీ మొద‌లుపెట్టిన `ఆప‌రేష‌న్ వైసీపీ`లో భాగంగా.. సుమారు 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ కండువా క‌ప్పేసుకున్నారు. వారు వైసీపీ టికెట్ మీద గెలిచినా.. దానికి రాజీనామా చేయ‌కుండానే సైకిల్ ఎక్కేశారు. అయితే వారితో రాజీనామా చేయించాల‌ని.. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ సహా ఆ పార్టీ నేత‌లంద‌రూ ఎప్ప‌డినుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌లోభాలకు పాల్ప‌డి, నైతిక విలువ‌లు తుంగ‌లోతొక్కి త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకున్నార‌ని టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కానీ దీనిపై చంద్ర‌బాబు స్పందించ‌డం లేదు క‌దా.. దాని ఊసే ఎత్త‌డం లేదు. అంతేగాక ఫిరాయింపుదారుల్లో కొంద‌రికి మంత్రి ప‌దవులు కూడా క‌ట్ట‌బెట్టేశారు!

ఈ సమ‌యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అయితే పార్టీలో చేరాలంటే ముందుగా ప‌ద‌వికి రాజీనామా చేసి రావాల‌ని.. స్ప‌ష్టంచేశారు. ఫిరాయింపుల గురించి తాము తెలుగుదేశం పార్టీని ఏ రకంగా తప్పుపడుతున్నామో.. అలా ఒక్క ఎమ్మెల్సీ పదవి గురించి తమను ఎవ్వరూ మాటలు అనే పరిస్థితి రాకూడదని జగన్‌మోహ‌న్‌రెడ్డి భావించారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయిపోయారు. నంద్యాల‌లో జ‌రిగిన స‌భ‌లో రాజీనామా చేసేశారు. దాదాపు ఆరేళ్ల పాటు ఉన్న పదవిని వదులుకోవటం ఇప్పుడున్న రాజకీయాల్లో ఆషామాషీ విషయం ఏమీ కాదు. కానీ రాజీనామా చేసి టీడీపీని ఒక్కసారిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో పడేశారు.

విలువలతో రాజకీయాలు చేస్తామని చెప్పుకునే టీడీపీకి ఇప్పుడు షాక్ త‌గిలింది. ఒక్క రాజీనామాతో ఇప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. టీడీపీని వీడి వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి బహిరంగ వేదిక సాక్షిగా టీడీపీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేలా చేయ‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అవ‌గా.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో ఇప్ప‌టివ‌ర‌కూ రాజీనామా చేయించ‌డంలో చంద్ర‌బాబు.. అట్ట‌ర్ ప్లాప్ అయ్యార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇది నిజంగా టీడీపీని ఇబ్బందికి గురిచేసే అంశ‌మే!!