కాకినాడ కార్పొరేష‌న్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌…. వెన‌క వాళ్ళ హ‌స్తం..!

ఏపీలో రెండు ఎన్నిక‌లు రాజ‌కీయాన్ని పూర్తి ర‌స‌కందాయంగా మార్చేశాయి. క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌తో పాటు కాకినాడ కార్పొరేష‌న్‌కు జ‌రుగుతోన్న ఎన్నిక‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ట్రెండింగ్‌గా మారాయి. నంద్యాల కీల‌కం కావ‌డంతో ఏపీ కేబినెట్ మొత్తం చాలా వ‌ర‌కు అక్క‌డే కేంద్రీకృత‌మైంది. ఇక కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా గెలిచి రావాల‌ని చంద్ర‌బాబు జిల్లా మంత్రుల‌కు, పార్టీ నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే కాకినాడ కార్పొరేష‌న్‌లో నిన్న‌టి వ‌ర‌కు అటు అధికార టీడీపీతో పాటు ఇటు విప‌క్ష వైసీపీ రెండిట్లోను గ్రూపు రాజ‌కీయాలు రాజుకున్నాయి. రెండు పార్టీల్లోను రెండు మూడు గ్రూపులు ఉండడంతో ఎవ‌రికి వారు నామినేష‌న్లు వేశారు. వైసీపీ విష‌యానికి వ‌స్తే ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి వ‌చ్చి వైసీపీలోని గ్రూపుల‌ను ఒక్క‌తాటిమీద‌కు తేవ‌డంతో స‌క్సెస్ అయ్యారు.

ఇప్పుడు టీడీపీలో మాత్రం ఈ గ్రూపు రాజ‌కీయాలకు ఫుల్‌స్టాప్ ప‌డ‌లేదు. ఇక్క‌డ ఒక్కో కార్పొరేట‌ర్ సీటుకు ఏకంగా ముగ్గురు నుంచి న‌లుగురు అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఇక టీడీపీలో కార్పొరేట‌ర్ సీటుకు భారీగా డ‌బ్బు చేతులు మారుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక్క‌డ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు చూస్తోన్న ఓ మంత్రి వీక్ క్యాండెట్ల‌కు టిక్కెట్లు ఇచ్చే క్ర‌మంలో భారీగా ముడుపులు తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 

స‌ద‌రు మంత్రి మ‌రీ వీక్‌గా ఉన్న న‌లుగురు క్యాండెట్ల‌కు టిక్కెట్ ఒక్కొక్క‌రి వ‌ద్ద రూ . 4-5 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుని వారికి టిక్కెట్లు ఇచ్చిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లోనే గుసగుస‌లు వినిపిస్తున్నాయి. వీరి వ‌ల్ల ఆయా డివిజ‌న్ల‌లో టీడీపీ చేజేతులు ఓడిపోయిన‌ట్ల‌వుతుంద‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు మొత్తుకుంటున్నా వారి మాట‌లు మాత్రం ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

స‌ద‌రు మంత్రికి అనుచ‌రులుగా ఉండ‌డంతో పాటు ఆయ‌న‌కు ఇత‌ర‌త్రా ప‌నుల్లో స‌హాయ స‌హ‌కారాలు చేసేవారికి ఆయ‌న సీట్లు ఇవ్వ‌డంతో పార్టీలో లోలోప‌ల అస‌మ్మ‌తి భగ్గుమంటోంది. మ‌రోవైసీపీ క‌లిసిక‌ట్టుగా దూసుకుపోతోంది. ఇక్క‌డ పోటాపోటీగా ఉన్న నేప‌థ్యంలో టీడీపీ ఏకంగా న‌లుగురు ఐదుగురు వీక్ క్యాండెట్ల‌కు టిక్కెట్ ఇస్తే పార్టీకి చాలా ఇబ్బంది త‌ప్ప‌ద‌న్న టాక్ న‌డుస్తోంది. అధిష్టానం దృష్టికి కూడా ఈ విష‌యం వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి అధిష్టానం ఈ విష‌యంలో ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటుందో ?  చూడాలి.