పాలిటిక్స్‌లోకి దిల్ రాజు.. కేసీఆర్ ఆఫర్ ఇదేనా!

సౌత్ ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీకి రాజ‌కీయాల‌కు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రెండు రంగాల‌కు బ‌ల‌మైన అనుబంధం ఉంది. ఇక త‌మిళ్‌లో కంటే తెలుగులో మ‌రింత బ‌ల‌మైన బంధం వీటి మ‌ధ్య ఉంది. ఇక టాలీవుడ్‌లో చాలా మంది నిర్మాత‌లు కూడా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ అగ్ర‌నిర్మాత దిల్ రాజు కూడా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇండ‌స్ట్రీలో నిర్మాతలు చాలామంది ఉన్నా సెలబ్రిటీ నిర్మాతలు చాలా చాలా తక్కువగా ఉంటారు. అలాంటి సెలబ్రిటీ నిర్మాతగా దిల్ రాజును చెప్పొచ్చు. ఇటీవ‌ల దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన అన్ని సినిమాలు స‌క్సెస్ అవుతున్నాయి. ఈ యేడాది నేనే లోక‌ల్ – డీజే – ఫిదా సినిమాలు హిట్ అవ్వ‌గా త్వ‌ర‌లోనే ఆయ‌న నిర్మించిన రాజా ది గ్రేట్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

దిల్ రాజు బ్యాన‌ర్‌లో సినిమా వ‌స్తుందంటే క‌థ‌లో ఎంతో ద‌మ్ము ఉంటుంద‌న్న విష‌యం సాధార‌ణ ప్రేక్ష‌కుడికి కూడా అంచ‌నా ఉంటుంది. ఇక తాజాగా దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన ఫిదా సినిమా చూసిన సీఎం కేసీఆర్ దిల్ రాజుకు తెలంగాణ‌పై ఉన్న అభిమానానికి ఫిదా అయ్యాడ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే దిల్ రాజుకు ఒక ఊహించని ఆఫర్ కేసీఆర్ ఇచ్చినట్లు టీ పాలిటిక్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం దిల్ రాజును రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజు సామాజిక వర్గంతో పాటు.. ఆయనకు తన సొంత ప్రాంతంలో ఉన్న పట్టు నేపథ్యంలో 2019 ఎన్నికల్లో లోక్ సభ స్థానం టికెట్టును ఇస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్ర‌స్తుతం నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ కుమార్తె క‌విత ఉన్నారు. క‌విత వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల‌నుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే క‌విత ఎమ్మెల్యేగా వెళితే ఆ స్థానం నుంచి దిల్ రాజును ఎంపీగా పోటీ చేయించాల‌నేది కేసీఆర్ ప్లాన్‌గా తెలుస్తోంది. ఒక వేళ క‌విత ఎంపీగా పోటీ చేస్తే రాజుకు జ‌హీరాబాద్ సీటుపై కేసీఆర్ నుంచి హామీ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా దిల్ రాజు పొలిటిక‌ల్ ఎంట్రీ వార్త ఇప్పుడు టీఆర్ఎస్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.