నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలో శిల్పా ప్ర‌ధాన అస్త్రం

భూమా ఫ్యామిలీపై ఉన్న సెంటిమెంట్ ప్ర‌ధాన అస్త్రంగా టీడీపీ నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలోకి దిగ‌బోతోంది! అంతేగాక మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయ‌కులు.. ఇలా టీడీపీ బ‌ల‌గ‌మంతా నంద్యాల‌లోనే మోహ‌రించేశారు. కానీ వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మాత్రం త‌న గెలుపుపై ధీమాగా ఉన్నారు. విజ‌యం త‌న‌వైపే ఉంటుంద‌ని న‌మ్మ‌కం పెట్టుకు న్నారు. ప్ర‌జ‌లు సెంటిమెంట్ కంటే.. అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తార‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. గ‌తంలో చిన్న చిన్న త‌ప్పిదాల వ‌ల్ల ఓడిపోయినా.. ఈసారి మాత్రం అటువంటిదేమీ ఉండ‌ద‌ని.. విజ‌యం మాత్రం ప‌క్కా అని బ‌ల్ల‌గుద్దిమ‌రీ చెబుతున్నారు. ఆయ‌న ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండ‌టానికి కార‌ణాలు కూడా లేక‌పోలేద‌ట‌.. 

2004 నుంచి శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాలతో మంచి అనుబంధం ఉంది. అంతకు ముందు నుంచే నంద్యాలలో ఆయన ఉన్నా 2004లో శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్తి ఫరూక్ పై యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  2009 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన శిల్పా టీడీపీ అభ్యర్థి భాస్కర్ పై 32 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి చేతిలో మూడు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అతి స్వ‌ల్ప తేడాతో ప‌రాజయం పొందారు.

అయితే ఈసారి అలా ఉండ‌దని స్ప‌ష్టంచేస్తున్నారు శిల్పా! ఇప్పుడు ఎన్నిక‌ల్లో గెలిచినా కేవ‌లం రెండేళ్ల కంటే త‌క్కువ స‌మ‌య‌మే అయినా.. ఆయ‌న టీడీపీని కాద‌ని వైసీపీలో చేరిపోయారు. దాదాపు పదమూడేళ్ల నుంచి నంద్యాల ప్రజలతో ఉన్న అనుబంధం తనను గెలిపిస్తుందని శిల్పామోహన్ రెడ్డి బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. భూమా కుటుంబం కంటే నంద్యాలతో తనకే ఎక్కువ అనుబంధం, సంబంధం ఉందని శిల్పా గుర్తు చేస్తున్నారు. అందుకోసమే శిల్పా మోహన్ రెడ్డి ఈ ఎన్నికపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సెంటిమెంట్ కంటే అనుబంధానికే నంద్యాల ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారంటున్నారు శిల్పా సోదరులు.

తాము రెండు దశాబ్దాలుగా నంద్యాల ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నందున తమదే గెలుపన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా చేసిన స‌మ‌యంలో నంద్యాల‌కు చేసిన అభివృద్ధి ప‌నుల‌ను గుర్తుచేస్తున్నారు. అవే త‌మ‌ను విజ‌య తీరాల‌కు చేరుస్తాయ‌ని చెబుతున్నారు. ఇక టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్రహ్మానందరెడ్డి రాజకీయాలకు కొత్త కావడం తమకు కలిసొస్తుందంటున్నారు. ప్రతి ఓటరుతో టచ్ ఉందంటున్నారు శిల్పా మోహన్ రెడ్డి. మరి అనుభ‌వ‌మే ఆయ‌న‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌గా నిలుస్తుంద‌ని శిల్పా వ‌ర్గీయులు చెబుతున్నారు.