త‌మ్ముడి బాట‌లోనే అన్న.. కార‌ణాలివే

ర‌క్త‌సంబంధం వేరు.. రాజ‌కీయాలు వేరు! కానీ నంద్యాల‌లో ఇప్పుడు ర‌క్త‌సంబంధం వైపు రాజకీయాలు న‌డుస్తున్నాయి. త‌మ్ముడి న‌డిచిన బాట‌లోనే అన్న కూడా ప‌య‌నించేందుకు సిద్ధమైపోయారు. త‌మ్ముడు శిల్పా మోహ‌న‌రెడ్డి పార్టీ వీడుతున్నా.. వేరే పార్టీ నుంచి బ‌రిలోకి దిగినా.. తాను మాత్రం టీడీపీలోనే ఉంటాన‌ని, పార్టీ విజ‌యానికే ప‌నిచేస్తాన‌ని చెప్పిన ఎమ్మెల్సీ శిల్పాచ‌క్ర‌పాణి.. ఇప్పుడు వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అయ్యారు. మ‌రి టీడీపీలో ఉంటాన‌ని చెప్పిన ఆయ‌న‌.. ఇంత స‌డ‌న్‌గా పార్టీ మారాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మేంట‌నే ప్ర‌శ్న అందరిలోనూ మొద‌లైంది. మ‌రి దీనికి స‌మాధానం శ్రీ‌శైలం!

నంద్యాలలో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా పెరిగిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి ఈనెల 3వ తేదీన జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ముఖ్య కార్యకర్తలతో సమావేశమై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన సోదరుడు వైసీపీలోకి వెళ్లినా ఆయన టీడీపీలోనే కొనసాగుదామనుకున్నారు. రక్తసంబంధం వేరు… రాజకీయాలు వేరని ప్రకటించారు. అయితే తాజాగా సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి స్వయంగా ఇంటికి వచ్చి వైసీపీలోకి రమ్మని ఆహ్మానించడంతో ఆయన ఫ్యాన్ గుర్తుకే ఓటేసేందుకు రెడీ అయినట్లు సమాచారం.

శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీని వీడటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి తన సోదరుడు పార్టీని వీడినప్పటి నుంచి టీడీపీ నేతలు తనను అనుమానిస్తుండటం, మరొకటి వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం సీటు. ఈ సీటు టీడీపీ తనకిస్తుందన్న నమ్మకం కోల్పోయార‌ట‌. తనను బుజ్జగించేందుకు వచ్చిన టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, సీఎం రమేష్ తో ప్రధానంగా శ్రీశైలం టిక్కెట్ పైనే చర్చించినట్లు తెలిసింది. వారు ఎలాంటి హామీ ఇవ్వ‌లేద‌ని. అధినేత‌తో చ‌ర్చించిన త‌ర్వాతే శ్రీశైలం టిక్కెట్ పై క్లారిటీ ఇస్తామని చెప్పార‌ట‌. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని వైసీపీ నేతలు శిల్పా చ‌క్ర‌పాణికి స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌బోతున్నార‌ట.