2019రాజ‌మండ్రి ఎంపీ సీటుపై టీడీపీ, వైసీపీ కొత్త ప్రయోగం!

ఏపీలో ఎవ‌రైనా అధికారం ద‌క్కించుకునేందుకు తూర్పు గోదావ‌రి జిల్లా కీల‌క‌మైంది. ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంద‌న్న నానుడి ఉంది. గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగాను ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ జిల్లాలో రాజ‌మండ్రి ఎంపీ సీటుకు రాజ‌కీయంగా చాలా ప్రాధాన్య‌త ఉంది.

రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేసేందుకు ప్ర‌ధాన పార్టీల నుంచి ప్ర‌ముఖులే పోటీప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ, వైసీపీ అభ్య‌ర్థులుగా పోటీ ప‌డేందుకు ఇద్ద‌రు ప్ర‌ముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగంటి ముర‌ళీమోహ‌న్‌ను వ‌యోః భారంతో ప‌క్క‌న పెడ‌తార‌ని ఇప్ప‌టికే టాక్ వ‌చ్చేసింది. వాస్త‌వంగా చూసినా నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న పెద్ద‌గా తిర‌గ‌లేక‌పోతున్నారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం తాళ్ల‌పూడి మండ‌లం అన్న‌దేవ‌ర‌పేట‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త అల్లూరి ఇంద్ర‌కుమార్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. చంద్ర‌బాబు నుంచి ఆయ‌న‌కు రాజ‌మండ్రి ఎంపీ టిక్కెట్టుపై హామీ కూడా వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇంద్ర‌కుమార్ తెర‌వెన‌క ఇప్ప‌టికే వ‌ర్క్ స్టార్ట్ చేసేశారు.

వైసీపీ నుంచి కందుల దుర్గేష్‌..?

ఇక వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ, రాజ‌మండ్రి న‌గ‌ర వైసీపీ అధ్య‌క్షుడు కందుల దుర్గేష్ పేరు అనూహ్యంగా తెర‌మీద‌కు వ‌స్తోంది. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న కొద్ది రోజుల క్రిత‌మే వైసీపీలో చేరారు. ఆయ‌న రాజ‌కీయ మేథావి ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కు ప్రియ‌శిష్యుడు. ఇక ఇక్క‌డ వైసీపీ నుంచి గ‌త ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన బొడ్డు వెంక‌ట‌ర‌మ‌ణ టీడీపీలోకి వెళ్లిపోయారు. అయితే దుర్గేష్‌పేరును వైసీపీ నుంచి ఎంపీగా ప‌రిశీలిస్తున్నా సామాజిక స‌మీక‌ర‌ణ‌లు మాత్రం ఆయ‌న‌కు ప్ర‌ధాన అడ్డంకిగా మారాయి.

తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం ఎంపీ సీటు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ కాగా కాకినాడ కాపుల‌కు, రాజ‌మండ్రి క‌మ్మ‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌క‌కు ఇస్తున్నారు. అయితే 1996 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సంప్రదాయానికి భిన్నంగా బీజేపీ చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇచ్చింది. ఆ ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి బీజేపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేసిన గిరజాల వెంకటస్వామి నాయుడు పోటీ చేసి కాపు సామజిక వర్గం నుంచి గెలిచారు. ప్ర‌స్తుతానికి వైసీపీ నుంచి ఎంపీగా దుర్గేష్ పేరు వినిపిస్తున్నా జ‌గ‌న్ ఇక్క‌డ ఎలాంటి ప్రయోగం చేస్తాడో ? చూడాలి.