నంద్యాల‌లో టీడీపీ-వైసీపీ స‌ర్వేలు ఏం చెపుతున్నాయ్‌

నంద్యాల ఉప పోరు స‌మీపిస్తున్న కొద్దీ.. విజ‌యం ఎవ‌రిద‌నే విష‌యంపై స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంటుంది.  ఏ టీ బ‌డ్డీ వ‌ద్ద చూసినా.. ఏ న‌లుగురు మాట్లాడుకున్నా.. గెలుపు స‌మాచారంపైనే మాట‌లు న‌డిచిపోతుంటాయి. ఇక‌, నంద్యాల వంటి అతి కీల‌క‌మైన ఎన్నిక‌, అదికూడా రెండు బ‌ల‌మైన ప‌క్షాలు అక్క‌డే రోజుల త‌ర‌బ‌డి తిష్ట‌వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అంచ‌నాలు ఎలా ఉంటాయ‌నేది చెప్ప‌డం క‌ష్టం. గెలుపు నాదంటే నాద‌నే ఈ రెండు ప‌క్షాల గురించి ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో ఇప్పుడు వైసీపీ, టీడీపీల‌తో పాటు కాంగ్రెస్ కూడా గెలుపు ఎవ‌రిది! అనే విష‌యంపై నంద్యాల‌లో పెద్ద ఎత్తున స‌ర్వే చేయించింది. 

క్షేత్ర‌స్థాయిలో ఏ పార్టీకి ఆ పార్టీ నిర్వ‌హించుకున్న ఈ స‌ర్వేలీల‌ల్లో.. ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు వెలుగు చూశాయి. ఏపార్టీ చేయించుకున్న స‌ర్వేలో ఆ పార్టీకే గెలుపు అని తేలింది. అంతేకాదు, త‌మ ప్ర‌త్య‌ర్థులు భారీ ఓట్ల తేడాతో ఓడిపోతార‌ని కూడా ఈ స‌ర్వేలు చాటాయి. ప్ర‌స్తుతం ఈ స‌ర్వేల విష‌య‌మే నంద్యాల‌లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ నిర్వ‌హించిన సర్వేలో .. ఆ పార్టీ  అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి గెలుపు ఖాయ‌మ‌నీ, 10 నుంచి 15 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తార‌ని తేలింద‌ట‌!  అంతేకాదు, ముస్లిం మైనార్టీ వ‌ర్గానికి చెందిన ఓట్ల‌న్నీ గుండుగుత్తుగా త‌మ‌కే ప‌డ‌తాయ‌ని కూడా తేలింద‌ని స‌ర్వే చెప్పింది. ఇది ఆపార్టీ వ‌ర్గాల్లో జోష్ నింపుతోంది. 

ఇక‌, టీడీపీ స‌ర్వే ప్ర‌కారం ఆ పార్టీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద రెడ్డి గెలుస్తార‌నీ, 15 నుంచి 18 వేల ఓట్లు మెజారిటీ వ‌స్తుంద‌ని తేలింద‌ట‌. ఈ పార్టీ కూడా ముస్లింలు త‌మ‌కే అండ‌గా నిలిచార‌ని తేల్చింద‌ట‌. చంద్ర‌బాబు చేప‌ట్టిన అభివృద్ధి, ప‌థ‌కాలు వంటివి త‌మ‌కు ప్ల‌స్‌లుగా మారాయ‌ని ఈ స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంద‌ట‌. దీంతో ఈ నివేదిక‌ను మంత్రి భూమా అఖిల ప్రియ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు పంపించార‌ని స‌మాచారం.  దీనిపై వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు.. అఖిల‌కు ఫోన్ చేసి.. ఈ   మెజారిటీ చాల‌ద‌నీ, ఈ నంబ‌ర్ మారే అవ‌కాశాలుంటాయ‌నీ, ఇంకా పెంచే దిశ‌గా పార్టీ శ్రేణులు క‌ష్ట‌ప‌డాల‌ని ఆయ‌న చెప్పార‌ట‌. 

మారిన ప్ర‌సంగాల తీరు!

స‌ర్వేల మ‌హ‌త్య‌మో ఏమోకానీ, అటు టీడీపీ ఇటు వైసీపీ నేత‌ల ప్ర‌చార ప‌ర్వంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. త‌మ త‌మ ప్ర‌సంగాల్లో స‌ర్వేల‌లో వ్య‌క్త‌మైన రిజ‌ల్ట్‌పై ధీమా వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. భూమా అఖిల ప్రియ తాజా ప్ర‌సంగాల్లో వినిపించే ధీమాకు ఈ స‌ర్వే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. తాను ఇప్పుడు టీడీపీ అభ్య‌ర్థి గెలుపు గురించి ఆలోచించ‌డం లేద‌నీ, ఎంత మెజారిటీ సాధిస్తామ‌నే దాని గురించే ఆలోచిస్తున్నాన‌ని  ఆమె  చెబుతున్నారు. 

వైసీపీ విష‌యానికొస్తే..  తాము అనుకున్న 25 వేల మెజారిటీ క‌న్నా కేవ‌లం 15 వేల మెజారిటీ మాత్ర‌మే వ‌స్తుంద‌ని  తేల‌డంతో జ‌గ‌న్ త‌న ప్ర‌సంగాల తీరును మార్చుకోవాల‌ని యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక నుంచి బాబుపై వేడి త‌గ్గించాల‌ని, తాము ఏం చేయాల‌ను కున్న‌దీ వివ‌రించాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యార‌ట. మ‌రి ఏం జ‌ర‌గుతుందో చూడాలి. మొత్తానికి స‌ర్వేల ఎఫెక్ట్ బాగానే వ‌ర్క‌వుట్ అవుతోంది.