భారీ క్రికెట్ బెట్టింగ్ కుంభ‌కోణం… వెన‌క వైసీపీ ఎమ్మెల్యే!

రాష్ట్రంలో ఇటీవ‌ల కాలంలో భారీ ఎత్తున సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ యువ‌త‌ను నిర్వీర్యం చేస్తోంది.  వంద‌లు దాటి వేల రేంజ్‌కు చేరిపోయిన ఈ బెట్టింగులు ఇప్పుడు కోట్ల‌కు ఎగ‌బాకాయి. దీంతో దీనినే వ్య‌స‌నంగా భావిస్తున్న వాళ్లు త‌మ ఇల్లు.. వాకిళ్ల‌ను సైతం అమ్ముకుని జీవితాల‌ను ఈ బెట్టింగుల‌కు అంకితం చేసి.. తీవ్ర‌స్థాయిలో న‌ష్ట పోతున్నారు. ఇక‌, నెల్లూరులో ఇటీవ‌ల కాలంలో వెలుగు చూసిన క్రికెట్ బెట్టింగ్ కుంభ‌కోణం మ‌రింత క‌ల‌క‌లం సృష్టిస్తోంది. యువ‌త చెడు మార్గం ప‌ట్టకుండా చూడాల్సిన వివిధ పార్టీ ల నేత‌లే .. బెట్టింగుల కుంభ‌కోణాల‌కు తెర‌దీసిన‌ట్టు అధికారులు గుర్తించారు. 

ముఖ్యంగా విప‌క్షం వైసీపీకి చెందిన ఎమ్యెల్యే  నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ కుంభ‌కోణానికి పాల్ప‌డుతున్న‌ట్టు స‌మాచారం.  త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాలు, అన్యాయాల‌తో పేట్రేగిపోయి వివిధ కేసుల్లో చిక్కుకోగా లేంది.. తాను ఈ మాత్రం బెట్టింగుల‌కు పాల్ప‌డితే త‌ప్పేంటి అనుకున్నారో ఏమో.. రూ. కోట్లు పెట్టి ఈ బెట్టింగుల‌కు తెర‌దీశాడు. దీంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్న ఈ బెట్టింగ్ ముఠాలో దాదాపు 115 మందిని  పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ చేశారు. ఈ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ వెనక రాజకీయ పార్టీల నేతల హస్తం ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో విన్పిస్తున్నాయి. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కొందరిని కోర్టు అనుమతితో విచారణకు తీసుకున్నారు. 

వీరిలో ప్రధాన నిందితులు కృష్ణ సింగ్, షంషీర్, వెంకట సురేష్ , అనిల్ కుమార్ లను పోలీసులు విచారిస్తున్నారు.అయితే ఈ క్రికెట్ బుకీల నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే దాదాపు 45 కోట్ల రూపాయలను తీసుకున్నారన్న వార్తలు సోషల్ మీడయాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తమ పార్టీ నేత ప్రమేయం ఉందని వస్తున్న ప్రచారంపై పోలీసులు స్పందించాలని సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యే పేరు బయటపెట్టాలని, లేకుంటే ఆ వార్తలను ఖండించాలని వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి కోరారు.

కాగా ఈ క్రికెట్ బెట్టింగ్ లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని కూడా చెబుతున్నారు.  ఇక‌, ఈ విష‌యంలో ఎప్ప‌టి లాగానే అధికార ప‌క్షంపై విప‌క్షం బుర‌ద‌జ‌ల్లుతోంది. అస‌లు కుంభ‌కోణాల‌కు టీడీపీ నేత‌లే కేంద్ర బిందువుల‌ని విమ‌ర్శిస్తోంది. పోలీసులు కావాల‌నే వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. ద‌మ్ముంటే .. టీడీపీ నేత‌లను అరెస్టు చేసి విచారించాల‌ని, అప్పుడే అస‌లు నిజాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.