రేపు కొడుకు పెళ్లి… టీడీపీ ఎమ్మెల్యే ఏం చేశారంటే… ద‌టీజ్ జీవి

సొంతం లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయ‌ప‌డ‌వోయ్‌! అన్నారు గుర‌జాడ అప్పారావుగారు. వాస్త‌వానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాళ్లు… లాభం మొత్తం మానుకుని మీకే సేవ‌చేస్తాం.! అని ప్ర‌మాణం కూడా చేస్తారు. కానీ..  ఆత‌ర్వాత ఏమ‌వుతుందో ఏమో.. అనూహ్యంగా యూట‌ర్న్ తీసేసుకుంటారు.  జ‌నాల్ని మ‌ళ్లీ ఐదేళ్ల దాకా క‌లిసే ప్ర‌య‌త్నమూ చేయ‌రు. వాళ్ల క‌ష్టాల‌ను తీర్చే ప్ర‌య‌త్న‌మూ చూడ‌రు. అయితే, అంద‌రూ అలాగే ఉంటారా? అంటే..  కాద‌నే చెప్పాలి.. తాజా ప‌రిణామంతో! తెల్ల‌వారి కొన్ని గంట‌ల్లో త‌న కుమారుడి వివాహం పెట్టుకుని కూడా అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే చేసిన ప్ర‌జా సేవ నిజంగా న‌భూతో .. అని అనిపించ‌క‌మానదు! దీంతో ఇప్పుడు అంద‌రూ ఆయ‌న‌కు జేజేలు ప‌లుకుతున్నారు. 

ఇంత‌కీ  ఏం జ‌రిగిందంటే.. గుంటూరు జిల్లా టీడీపీ  వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కుమారుడు గోనుగుంట్ల హరీష్‌ వివాహం బుధ‌వారం(అంటే ఈరోజే) గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో జరగనుంది. అనంతరం 18వ తేదీన ఉదయం వినుకొండ పట్టణంలోని లయోలా హైస్కూల్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.  ఎమ్మెల్యే వారి ఇంట పెళ్లి బాజా అంటే ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అతిథుల‌కు ఎలా ఆహ్వానం ప‌ల‌కాలి?  ఎంత గ్రాండ్‌గా పెళ్లి జ‌రిపించాలి?  ఎన్ని ర‌కాల వంట‌కాలు సిద్ధం చేయించాలి? అబ్బో వీట‌న్నింటితో పెళ్లివారిల్లు హోరెత్తిపోతూ ఉంటుంది. 

ఇక‌, పెళ్లికొడుకు ఇంట్లో అయితే, అందునా ఎమ్మెల్యే గారి ఇల్ల‌యితే… పెళ్లికి వ‌చ్చే అతిర‌థ‌మ‌హార‌థుల‌కు స్వాగ‌త స‌త్కారాల నుంచి తిరిగి వారిని సాగ‌నంపే వ‌ర‌కు ఎంతో శ్ర‌ద్ధ వ‌హించాలి. ఈ క్ర‌మంలో పెళ్లికొడుకు తండ్రి ఎంత బిజీగా ఉంటాడో అంద‌రికీ తెలిసిందే. అదేవిధంగా  ఆంజ‌నేయులు కూడా బిజీ అయిపోయారు. క్ష‌ణం కూడా తీరిక లేకుండా పెళ్లి ప‌నుల్లో మునిగిపోయారు. అయితే, ఇంత‌లో అనూహ్యంగా గుంటూరులోని ఉమ్మడివరంలో బోరుబావిలో చిన్నారి పడిపోయిన విషయం ఎమ్మెల్యేను క‌ల‌చివేసింది. అంత పెళ్లి హ‌డావుడిలో ఉండికూడా.. తెల్లారితో కొడుకు పెళ్లి పీట‌ల‌పై కూర్చోవాల్సిన స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా కూడా .. ఆ ప‌నుల‌ను ఒక్క ఉదుట‌న ప‌క్క‌న పెట్టి.. ప్ర‌జా సేవే ప‌ర‌మార్థంగా ఎమ్మెల్యే ఆంజ‌నేయులు ఉమ్మ‌డివ‌రం వెళ్లిపోయారు. 

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. అక్కడే మకాం వేసి జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి వారిని ఘటనా స్థలానికి తీసుకువచ్చి వారి సహకారంతో బాలుడిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. ఎప్ప‌టిక‌ప్పుడు డాక్ట‌ర్ల‌ను సైతం సంప్ర‌దిస్తూ.. అవ‌స‌ర‌మైతే.. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను లెక్క‌కు మిక్కిలి ఏర్పాటు చేయాల‌ని కూడా ఆదేశించారు. అదేస‌మ‌యంలో బిడ్డ బ‌తుకుతాడో లేదో అని రోదిస్తున్న త‌ల్లిదండ్రుల‌ను ఓదారుస్తూ.. ఎమ్మెల్యే ఆంజ‌నేయులు నిజ‌మైన ప్ర‌జాసేవ‌కుడిగా మారిపోయారు.  అయితే, వీరి కృషి ఫ‌లించి మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటాక‌.. బాబును అందరూ కలిసి రక్షించుకోగలిగారు.

ఒక వైపు కుమారుడి వివాహాన్ని లెక్కచేయకుండా సొంత నియోజకవర్గంలో ఆపద ఉందని సంఘటనా స్థలంలోనే మకాంవేసి జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా కాపాడే ప్రయత్నాల్లో నిమగ్న‌మైన ఎమ్మెల్యే ఆంజ‌నేయులుకి అన్ని వైపుల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. సో.. ప్ర‌స్తుతమున్న చాలా మంది ఎమ్మెల్యేల‌కు ఆంజ‌నేయులు ఆద‌ర్శం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.